ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టుగా ఉంది.
తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది. ఇప్పుడు పార్టీని పట్టించుకునే నాథుడు లేక వెలవెలబోతోంది. పార్టీలో ఉత్తేజం అనేదే లేదు. యువరక్తమే లేదు. ఇంకా ఆ సోకాల్డ్ నాయకులే. వాళ్లు మారరు. టీడీపీని మార్చరు. చంద్రబాబు కూడా ఇంకా వాళ్లనే నమ్ముకొని కూర్చున్నారు.
ఇప్పుడు ఏం చేయాలన్నా.. క్షేత్ర స్థాయి నుంచి మార్పులు చేసుకుంటూ రావాలి. కొత్తవారికి పార్టీలో అవకాశం ఇవ్వాలి. సీనియర్లతో పాటు అందరికీ సముచిత స్థానం కల్పించాలి.
కనీసం వచ్చే ఎన్నికల వరకైనా పార్టీని పునరుత్తేజం చేయకపోతే టీడీపీ నామరూపం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని లేటుగా అయినా లేటెస్ట్ గా చంద్రబాబు తెలుసుకున్నట్టున్నారు. అందుకే.. టీడీపీలో భారీ మార్పులు చేయబోతున్నారు.
ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ మండలస్థాయి వరకు పూర్తి చేసింది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడా త్వరలో పార్టీ నియమించనుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారట.
ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లలో ఎక్కువ అనుభవం ఉన్నది అచ్చెన్నాయుడికే. అధికార పార్టీ నాయకులకు సమాధానం చెప్పే సత్తా ఉన్న నేత. అందుకే.. పార్టీ సీనియర్లు కూడా అచ్చెన్నాయుడి వైపే మొగ్గు చూపుతున్నారట. దీంతో చంద్రబాబు కూడా అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సమాయత్తం అవుతున్నారట.
ప్రస్తుతం కమిటీలను నియమిస్తున్న చంద్రబాబు .. ఓవారం పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటించి.. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.