ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైఎస్ఆర్ బీమా పథకంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏదో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వైఎస్ఆర్ బీమా పథకంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటపు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పైగా ప్రచార ఆర్భాటాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
గడిచిన 16 నెలల కాలంలో ప్రచారపు ఆర్భాటాలు తప్ప జగన్ సర్కార్ నేటికీ ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రారంభించలేకపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి.. లబ్ధిదారులను తగ్గించి కొత్త పథకంగా ప్రవేశపెట్టడం ఈ ప్రభుత్వానికి షరామాములైందని మండిపడ్డారు. గతంలో బీమా అంటే అధికారులకు, డబ్బులున్న వారికి ఉండేదని, కానీ దేశంలోనే తొలిసారిగా సామాన్యుడికి సైతం బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని అచ్చెన్నాయుడు తెలిపారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా 16 నెలల తర్వాత పథకం పేరు మార్చి వైఎస్ఆర్ బీమాను ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
‘ఈ 16 నెలల కాలంలో గత పథకాన్ని ఎందుకు కొనసాగించలేకపోయారో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ 16 నెలల కాలంలో ఎంతో మంది నిరుపేదలు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ప్రాణాలు విడిచారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమాను వర్తింపచేయకపోవడంతో ఆయా కుటుంబాలకు పరిహారం ఆగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబు పేరు ప్రజలు మర్చిపోవాలనే.. 16 నెలల పాటు కుట్రపూరితంగా పథకాన్ని నిలిపివేశారు.’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇక తెలుగుదేశం హయాంలో 2.5 కోట్ల మందికి బీమా పథకం వర్తింపచేస్తే.. జగన్ హయాంలో అనేక ఆంక్షలు విధించి కోటి 41 లక్షల మందితోనే సరిపెడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. కోటి 10 లక్షల మందిని ఎందుకు పథకానికి దూరం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలుగుదేశం హయాంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడికి పథకాన్ని వర్తింపచేశాం. కేవలం రూ. 15 ప్రీమియం కట్టి పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడికి బీమా కల్పించాం. కానీ బియ్యం కార్డు ఉన్నవారికే అనే నిబంధనను తప్పనిసరి చేయడం వల్ల ఎంతో మంది సామాన్యులు పథకానికి దూరమవుతున్నారు. పేదలను పథకానికి దూరం చేసేటటువంటి సలహాలు ప్రభుత్వానికి ఎవరు ఇస్తున్నారు? కుటుంబ పెద్ద మరణానికి మాత్రమే సాయం అందిస్తే.. మిగతా వారి పరిస్థితేంటి? తెలుగుదేశం హయాంలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అసంఘటిత కార్మికునికి పథకాన్ని అమలు చేశాం.
వైఎస్ఆర్ బీమాకు చంద్రన్న బీమా పథకానికి మధ్య నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రన్న బీమాకు నమోదైన పాలసీదారుల పిల్లలు 9, 10 తరగతులు మరియు ఇంటర్/ ఐటిఐ చదువుతుంటే సంవత్సరానికి రూ.1,200/- చొప్పున స్కాలర్ షిప్ లు అందించాం. 18 నుంచి 60 ఏళ్ళ లోపు వారికి పాక్షిక అంగవైకల్యానికి రూ.3,62,500, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు., 60 నుంచి 70 ఏళ్ళ లోపు వారికి పాక్షిక అంగవైకల్యానికి రూ.3.25లక్షలు, శాశ్వత అంగవైకల్యం రూ.4.25 లక్షలు సాయం అందించాం. కానీ అటువంటివేమీ ఈ ప్రభుత్వం చేయకపోవడం బాధాకరం. తెలుగుదేశం హయాంలో దహన సంస్కారాల కోసం కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 5వేలు అందించాం. వ్యక్తి చనిపోయిన 12 వ రోజుకల్లా రూ. 5 లక్షల సాయం కుటుంబానికి అందించాం. కానీ గత పథకానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ.. ప్రజలను మోసం చేసేలా ఈ వైఎస్ఆర్ బీమాను తీసుకొచ్చారు. ఈ పథకంతో సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పేరు ఏదైనా.. ప్రజలకు పూర్తి న్యాయం జరిగే విధంగా పథకాలు ఉండాలి.’ అని అచ్చెన్నాయుడు అన్నారు ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడికి న్యాయం చేసేలా ప్రవేశపెట్టిన గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాలనే కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.