రెవెన్యూ డివిజన్ అడిగితే నేరమా.? జగన్ ఎందుకలా అంటున్నారు.?

‘పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెవెన్యూ డివిజన్ కావాలని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్లీనరీ వేదిక ద్వారా ఎద్దేవా చేశారు.

నిజానికి, వైఎస్ జగన్ ఈ విమర్శ గత కొంతకాలంగా చేస్తూనే వున్నారు. నిజానికి, చంద్రబాబు చేసింది తప్పే. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏనాడూ రెవెన్యూ డివిజన్ గురించి ఆలోచించలేదు. ఆ మాటకొస్తే, స్వర్గీయ ఎన్టీయార్ పేరుని ఓ జిల్లాకి పెట్టాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకి రాలేదు.

ఈ విషయాన్నే పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.. చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారు కూడా.! అయితే, సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చుకోలేకపోవడం చంద్రబాబు చేసిన నేరమైతే కాదు. రెవెన్యూ డివిజన్ వల్ల అదనంగా ఒరిగేదేముంటుంది.? అన్నది ఇక్కడ కీలకమైన అంశం.

కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి ఆంధ్రప్రదేశ్‌లో. వాటి వల్ల పరిపాలనా సౌలభ్యం.. అని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పు పట్టలేం. కానీ, వాటి వల్ల కొత్తగా జరిగే అభివృద్ధి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. రేప్పొద్దున్న ప్రభుత్వం మారితే, ఆ ప్రభుత్వానికి వైఎస్ జగన్ కూడా ఏదో ఒక అర్జీ పెట్టుకోవాల్సి రావొచ్చు.

అప్పుడు వైఎస్ జగన్ మీద అప్పటి ప్రభుత్వంలో వున్నవారు సెటైర్లు వేస్తే.? ఇలాంటివి రాజకీయాల్లో బ్యాక్ ఫైర్ అవుతుంటాయ్. వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా చేయాల్సిన వ్యాఖ్యలు కావివి.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.