విచారణ చేస్తున్నారా ? మర్యాదలు చేస్తున్నారా ?

ఇపుడిదే అనుమానం అందరిలోను మొదలైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్న 25వ తేదీ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు విచారిస్తున్న తీరు చూస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. మామూలు జేబుదొంగలను పట్టుకున్నపుడు కూడా పోలీసులు ఉతికి ఆరేస్తారు. తమ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణలో చిల్లర దొంగలను కూడా పోలీసులు ఉతికొదిలేస్తారు. అటువంటిది జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ మాత్రం ఐదురోజులుగా నోరిప్పకపోయినా పోలీసులు పల్లెత్తు మాటనటం లేదట. విచిత్రంగా లేదూ వినటానికి.

 

నమ్మినా నమ్మకపోయినా, విచిత్రంగా ఉన్న జరుగుతున్నది మాత్రం అదేనట. హత్యాయత్నం కేసును విచారించేందుకు ప్రభుత్వం సిట్ నియమించింది. అందులో మహేష్ చంద్ర లడ్డా, ఫకీరప్ప లాంటి సీనియర్ ఐపిఎస్ అధికారులున్నారు. వీరుకాకుండా చాలామంది అనుభవజ్ఞులైన పోలీసు అధికారులున్నారు చాలామందున్నారు. ఇంతమంది ఉండికూడా శ్రీనివాస్ నోటి నుండొ  ఒక్క మాట కూడా చెప్పించలేకపోతున్నామని చెబుతున్నారు. ఎవరైనా నమ్ముతారా ?

 

సిట్ కు నాయకత్వం వహిస్తున్న లడ్డా గడచిన రెండు రోజులుగా మీడియాతో ఇదే విషయాన్ని చెబుతున్నారు. లడ్డా చెబుతున్నది చూస్తుంటే నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారా లేకపోతే మర్యాదలు చేస్తున్నారా అన్న అనుమానాలు రాక ఏమవుతుంది. ఎందుకంటే, నిందితుడు అడిగినవెంటనే తినటానికి బిర్యానీలు తెప్పిస్తున్నారట పోలీసులు.  అంటే పోలీసు స్టేషన్లో చక్కగా బిర్యానీలు తింటు జల్సా చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

 

పోలీసుల విచారణలో ఉన్నామన్న భయం కూడా శ్రీనివాస్ లో ఏ కోశానా కనబడటం లేదట. మామూలుగా అయితే హత్యాయత్నం వెనుక ఎవరున్నారు ? పథకానికి సూత్రదారి ఎవరు ? పథకం ఎప్పుడు రచించారు ? కత్తి తెచ్చిందెవరు ? సుపారి ఎంత మాట్లాడుకున్నారు ? లాంటివి పోలీసులు రాబడతారని అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. అందుకే పోలీసుల విచారణపై అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.