APSRTC: పండుగతో ఆర్టీసీ ఖాతాలో భారీ లాభాలు.. ఆదాయం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జోష్‌ మారుమ్రోగింది. సొంత ఊర్లకు వెళ్లిన ప్రజలు పండుగ సందడిని ఆస్వాదించి, ఇప్పుడు తిరిగి పట్టణాలకు చేరుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రయాణాల రద్దీతో ఆర్టీసీ బస్సులు ఫుల్‌ బుకింగ్‌ అవ్వడం, దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ఊహించని లాభాలు రాబడడం విశేషంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయని, బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే రెట్టింపుగా ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్లడంతో రోడ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ముందుగా ప్లాన్‌ చేసిన ప్రత్యేక బస్సులతో పాటు అదనంగా నడిపిన సర్వీసులు కూడా ప్రజల డిమాండ్‌ తీరుస్తున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు ఏపీలోకి 4.3 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి.

ఈ రద్దీ పూర్తయ్యే సరికి మొత్తం 8 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉంటారని సమాచారం. పండుగ రద్దీతో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణీకులకు సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రూ.12 కోట్ల ఆదాయం సాధించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉందని, తిరుగు ప్రయాణాలు పూర్తయిన తర్వాత మొత్తం లెక్కలు తేలుతాయని తెలిపారు.

గత ఏడాది సంక్రాంతి కంటే ఈసారి ప్రయాణీకుల సంఖ్య, ఆర్టీసీ ఆదాయం రెండింటి పెరుగుదల గణనీయంగా ఉందని ఆర్టీసీ వర్గాలు ధృవీకరించాయి. ఈ పండుగ రద్దీతో ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించిన ఏపీఎస్ఆర్టీసీపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆర్థికంగా కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

Public EXPOSED: Chandrababu Ruling And YS Jagan Ruling || Ap Public Talk || Pawan Kalyan || TR