మళ్లీ తెరపైకి హోదా.. నేరం ఎవరిదో తెలీదా?

“ప్రత్యేక హోదా” అనేది ఏపీ వాసుల కల.. అది కాస్తా కలగానే మిగిలిపోయిన పరిస్థితి. జనం ఇప్పుడిప్పుడే ఆ సంగతులు గత్యంతరం లేక మరిచిపోతున్న పరిస్థితి. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని మోడీ & కో ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు కూడా. తాజాగా మరోసారి కేంద్రం ఆ విషయంపై స్పష్టంత ఇచ్చింది. హోదా లేదని తెగేసి చెప్పింది!

వాస్తవానికి… 2019 ఎన్నికల నాటికే హోదా అన్నది ముగిసిన అధ్యాయమని కేంద్రం చెప్పేసింది. అయితే అప్పట్లో ఈ విషయంపై ఎవరూ మాట్లాడింది లేదు. కానీ… జగన్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా పాటందుకున్నారు టీడీపీ నేతలు. హోదా అనేది కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం. హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ విచిత్రంగా హోదా ఇవ్వని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వదిలేసి, జగన్ ని కార్నర్ చేయాలని చూస్తున్నారు బాబు & కో!

2014లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపుడే చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని చెప్పేశారు. హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే సరే అన్నారు. పైగా.. హోదా గురించి అడిగిన విలేఖరులపైనా, సాధారణ ప్రజానికంపైనా ఫైరయ్యారు. “హోదావల్ల ఏమొస్తుంది” అంటూ ఎదురు ప్రశ్నించారు. హోదాకోసం నిరసన చేస్తున్నవారిపై కేసులు పెట్టించారు. అది.. హోదాతో చంద్రబాబుకున్న సంబంధం. అలాంటి చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్‌ తో పాటు టీడీపీ నేతలంతా.. హోదా సాధనలో జగన్ ఫెయిలయ్యారంటు రచ్చ చేస్తున్నారు.

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… ఎన్డీయేలో చంద్రబాబు పార్టనర్‌ గా ఉన్నపుడు టీడీపీ తరపున కేంద్రంలో సుజనా చౌదరి మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రి హోదాలో ఆయనే.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టీ మరీ చెప్పారు. అలాంటి సుజనా చౌదరి కూడా ఇప్పుడు హోదా సాధనలో జగన్ విఫలమయ్యారని చెబుతున్నారు.

“హోదా వద్దు – ప్యాకేజీ” ముద్దు అని ప్రకటించిన సమయంలో జనసేన అధినేత అయితే… కాస్త హడావిడి చేశారు. రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ మోడీపై విమర్శలు చేశారు. కానీ… కాలక్రమంలో తిరిగి మోడీతో జతకట్టారు.. చెట్టపట్టాలేసుకుని తిరిగారు!

సార్వత్రిక ఎన్నికలకు ఇంక ఏడాదిలోపే సమయం ఉండటంతో… ప్రచారాలు మొదలు పెట్టిన విపక్ష నేతలు మళ్లీ తెరపైకి హోదా అంశాన్ని ఇలా తీసుకువస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… ఎవరి వల్ల అయితే హోదా పోయి – ప్యాకేజీగా మారిందో, ఎవరి వల్ల అయితే హోదా రాకుండాపోయిందో.. వాళ్లంతా జగన్‌ ను బాధ్యుడిని చేయడం! అంటే… దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లన్నమాట. దీంతో.. ఇంతకుమించిన నిస్సిగ్గు రాజకీయం ఉంటుందా? జనాలకు ఏమీ తెలియదని బాబు & కో భావిస్తున్నారా? అంటూ ఫైరవుతున్నారు వైకాపా నేతలు.