ఏపీ:ఎమ్మెల్సీలుగా వైసీపీ అభ్యర్థులు ఆరుమంది ఏకగ్రీవమే!

Vizag steel effect on YSRCP

గడచిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలోనూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా జరిగిన మండలి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, కేవలం ఆరుగురి నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి.

వారంతా వైసీపీకి చెందిన వారే. దీంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. కాగా, వైసీపీ తరఫున మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్యలను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్, గురువారం నాడు వారికి బీ ఫారమ్ లను అందించిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురి ఎన్నికతో వైసీపీ బలం మండలిలో 18కి చేరుకుంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26గా ఉండగా, ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు ముగ్గురు వున్నారు. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి వుంది.

మండలిలో బలాన్ని చూసుకుని.. సాంకేతిక కారణాలు చూపుతూ అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటూ వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వచ్చే మే నెల నాటికి మండలిలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ ఖాయమన్నారు. జగన్‌ చేసే అభివృద్ధి పనులకు ఉభయ సభల్లోనూ మద్దతు లభిస్తుంది అన్నారు. చంద్రబాబు పెద్దల సభను ఐదేళ్ల నుంచి రాజకీయ వేదికగా వాడుకున్నారని సి.రామచంద్రయ్య మండిపడ్డారు. శాసన మండలి ప్రతిష్ఠ తగ్గిపోయిందని.. దాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో జరిగిన పరిణామాలతో శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ భావించారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆమోదించాలని కోరారు. కానీ అది కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. తర్వాత జగన్ ఉన్నట్టుండి తన వ్యూహం మార్చారు. వైఎస్సార్‌సీపీకి బలం పెరిగే అవకాశాలు ఉండటంతో అభ్యర్థులను బరిలోకి దింపారు. గతంలో ముగ్గురికి, ఇప్పుడు మరో ఆరుగురికి అవకాశం దక్కింది. మొత్తం తొమ్మిదిమంది పెద్దల సభకు వెళ్లడంతో వైఎస్సార్‌సీపీ బలం పెరిగింది. మేనాటికి పైచేయి ఖాయమని అధికార పార్టీ చెబుతోంది.