జూన్ 1 కల్లా యక్టివ్ మోడ్ లోకి నేతలు… ఎవరెవరు ఎప్పుడంటే…?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన అన్ని పార్టీల నేతలు తిరిగి యాక్టివ్ మోడ్ లోకి రాబోతున్నారని తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. వారంతా నేతలకు, కార్యకర్తలకు, అనుచరులకు అందుబాటులోకి వచ్చేస్తున్నారట. ఇందులో భాగంగా… జగన్, చంద్రబాబు, పవన్, షర్మిళ, పురందేశ్వరి తో పాటు పలువురు నేతలు ఈ జాబితాలో ఉన్నారు.

అవును… సుమారు రెండు నెలల పాటు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు.. పోలింగ్ ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో మెజారిటీ నేతలు విదేశాలకు వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో వారంతా తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారని అంటున్నారు.

“సిద్ధం”, “మేమంతా సిద్ధం” యాత్రలతో అవివిరామం 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా… మే 13న పోలింగ్ ముగిశాక, 17న లండన్ పర్యటనకు వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లారని అంటున్నారు.

ఈ క్రమంలో తిరిగి ఈ నెల 31న జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. ఈయనతో పాటు పోలింగ్ అనంతరం విశ్రాంతి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలు సైతం జూన్ 1 నాటికి ఏపీకి చేరుకోనున్నారని తెలుస్తుంది. వీరంతా ఫలితాలకు ముందు జగన్ తో భేటీ అయ్యే అవకాశం లేదని అంటున్నారు. జూన్ 4 తర్వాతే నేతలతో జగన్ భేటీ ఉండొచ్చని సమాచారం!

ఇక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కుటుంబ సమేతంగా అమెరికాతో పాటు ఇటలీ పర్యటనకు వెళ్లారని కథనాలొస్తున్నాయి. వీరి పర్యటనపై అధికారిక ప్రకటనలు లేనప్పటికీ.. ఊహాగాణాలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఇవాళ రాత్రి లేదా రేపు తిరిగి ఇండియాకు వస్తారని చెబుతున్నారు.

ఇదే క్రమంలో… పవన్ కల్యాణ్ సైతం తిరిగి ఇండియాకు ఒకటి రెండు రోజుల్లో వస్తారని.. అనంతరం షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని.. జూన్ 3న మాత్రం మంగళగిరి ఆఫీసులో అందుబాటులో ఉంటారని సమాచారం! అదేవిధంగా పురంధేశ్వరి కూడా 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరుకోబోతుండగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షర్మిల కూడా 3వ తేదీకి కడప చేరుకోనున్నారని అంటున్నారు.