జగన్ సర్కార్ వాహనధారులపై ఏపిలో అమలు చేయనున్న ట్రాఫిక్ జరిమానాలు హాట్ టాపిక్ గా మారాయి. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై అత్యంత భారీగా జరిమానాల విధింపు ఏ విధంగా సమంజసమేనా అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. సరైన రోడ్లు, సిగ్నల్ వ్యవస్థ లేకుండా అంతంత జరిమానాలు ఎలా కడతారన్నది వాహనదారులను తొలిచేస్తున్న ప్రశ్న లు. ఈ సమస్యపై ఇప్పటికే విపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాల విధింపుకు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ ద్వారా చట్టం చేసింది. ఈ జరిమాణాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్దేశించుకోవొచ్చని పేర్కొంది. కానీ దీనిపై పలు రాష్ట్రాలు విముఖత చూపి ట్రాఫిక్ నిబంధనల చట్టాన్ని పక్కన పెట్టేశాయి.
పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే ప్రతిఒక్కరు తమకు తెలియకుండానే అందులో రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తారు. అదే విధంగా జాతీయ రహదారులతో పాటు పలు రోడ్లు, వంతెనలపై టోల్ చెల్లిస్తూ వస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వాటిని నిర్వహించే ప్రయివేట్ కంపెనీలు మాత్రం రోడ్లు గోతులు పడుతున్నా కనీసం మరమ్మత్తులు చేయకపోవడం జనాగ్రహానికి కారణం అవుతుంది. పలు దేశాల్లో ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘనలపై భారీగానే జరిమానాలు విధిస్తారు. అయితే అక్కడ చక్కటి రోడ్లు, సిగ్నల్ వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. ఏ మాత్రం రోడ్లు సక్రమంగా లేకపోయినా దానివల్ల వాహనదారుడు ఎలాంటి ప్రమాదాలకు లోనైనా న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వాల నుంచి ముక్కుపిండి మరీ నష్టపరిహారం వసూలు చేస్తారు. ఇలా ప్రజల్లో ఉన్న అవగాహన నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం రోడ్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తాయి. అవన్నీ కల్పించకుండా ఎదో రూపంలో జనం ముక్కుపిండి డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన సరికాదన్నది మేధావులు, విశ్లేషకులు చేస్తున్న సూచనలు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు పోలీస్, రవాణా శాఖల్లో అవినీతికి మరింత ఆజ్యం పోస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ కి 10వేలరూపాయల జరిమానా చెల్లించాలిసిన వ్యక్తి వెయ్యి లేదా ఐదు వందల రూపాయల లంచం ఇచ్చి ఫైన్ కట్టకుండా తప్పించుకుంటారని, దీనివల్ల వ్యవస్థలు మరింత మరింత మకిలిగా మారిపోతాయన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతుంది. సినిమాలు వేరు వాస్తవాలు వేరు అని భరత్ అనే నేను సినిమా తరహాలో జగన్ సర్కార్ బాదుడు కు సిద్ధం అయితే సర్కార్ విమర్శలకు గురౌతుందని చెబుతున్నారు.
ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పాఠశాల స్థాయి నుంచి అవగాన మొదట పెంచాలని సూచిస్తున్నారు పలువురు. అదే విధంగా తక్కువ స్థాయిలో పెనాల్టీలు ఉంటే జరిమానాలు చెల్లించేవారు ఎక్కువ మంది ఉంటారని తద్వారా ఖజానాకు సొమ్ములు ఎక్కువగానే వస్తాయని అంటున్నారు. నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని, రేసింగ్ ల మాదిరి దూసుకుపోతున్న కుర్రకారును పోలీసులు అదుపుచేయలేకపోతున్న వైనాన్ని ఇప్పటికి హెల్మెట్ నిబంధనలు అంతా పాటించని విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు పలువురు. నెలంతా కష్టపడితే 10వేలరూపాయలు సంపాదించలేని మధ్యతరగతి, పేదవర్గాల వారిపై ఈ ఫైన్ లు విధిస్తే వారు ఎలా కట్టగలరన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందువల్ల దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు, కార్లకు ఒకేరకంగా జరిమానాలు విధించడం వంటివి తొలగించాలని జనం కోరుతున్నారు. మరి జగన్ సర్కార్ కనికరిస్తుందో కొరడా విదిలిస్తుందో చూడాలి.