(యనమల నాగిరెడ్డి)
త్వరలో దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత రాబోయే (కాబోయే) భారత ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయించేది టీడీపీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుగారే నని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు ప్రకటించారు.
కడప జిల్లాలో జరిగిన వివిధ జన్మభూమి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు “బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, నిధులివ్వడం లేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని” కేంద్రంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం పాఠకులకు విదితమే. తర్వాత ఆయన కాంగ్రెస్ స్నేహ హస్తం అందుకోవడం జరిగింది. ప్రస్తుతం తన అంగబలం, ఆర్థికబలం, మీడియా అండదండలు ఉపయోగించుకుంటూ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు కర్ణాటకలోని జేడీఎస్, తమిళనాడులోని డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి, అఖిలేష్ యాదవ్,ములాయంసింగ్ యాదవ్ లాంటి పెద్ద నాయకులను కలసి కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నిర్మించడానికి తీవ్రప్రయత్నాలు చేశారు.
ఇటీవల చెన్నైలో జరిగిన “కరుణానిధి” విగ్రహావిష్కరణ సభలో “కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ” అని కూడా ప్రకటించారు. అందుకు డీఎంకే అధినేత స్టాలిన్ మద్దతు పలికారు కూడా.
కాగా కడప పర్యటనలో పాల్గొన్న లోకేష్ బీజేపీని, వైసీపీని, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ, జనసేన అధినేతలు బీజేపీ తోకలుగా వర్ణించారు. యధావిధిగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. చివరగా ఆయన కాంగ్రెస్ కూటమిని గురించి ప్రస్తావించకుండా ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది చంద్రబాబే నని ప్రకటించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఈ మాటలు “లోకేష్ స్టయిల్ లో” వచ్చాయా? లేక టీడీపీ వ్యూహాం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారా? అని విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు. రాజకీయాలలో ఇలాంటి సిత్రాలు ఎన్నైనా జరగవచ్చు!