అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఇద్దరూ నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచేందుకు అంగీకరించారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ఇండో, పసిఫిక్ ప్రాంతంలో, వెలుపల శాంతి భద్రతలను పెంపొందించడానికి ఎదురుచూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

గత నెలలో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇద్దరు నేతల మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతలపై చర్చించినట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా సహకారాన్ని మరింత పెంచేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

అధ్యక్షుడు బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం అని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే, మోదీ, తన ట్వీట్ల ద్వారా అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా, తొలిసారి ఇరు దేశల నేతలూ ఫోన్ లో మాట్లాడుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.