ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ డోర్ డెలివరీ చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండే మీడియాలో ఫేక్ వార్తలు రాయిస్తూ రాక్షసానందం పొదుతున్నారని ఆరోపించారు.
అలాగే ఎన్నికల సమయంలో ఓట్లను లాక్కోవడానికి ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13వేల పంచాయతీల్లో 11 వేల పంచాయతీలు వైసీపీ సొంతం కావడం ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే నాటికి టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు, లోకేష్ ను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు నాని. తొలి విడతలో తాము 2,640 పంచాయతీలను వైసీపీ సొంతం చేసుకుందన్నారు.
ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో విద్వేషాలు రెచ్చకొట్టేందుకే చంద్రబాబు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని నాని ఆరోపించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రలు సీఎం జగన్ ముందు పనిచేయవన్నారు.మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ పై కొడాలి నాని పంచ్ లు వేశారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్.. మంగళగిరిలో గెలవలేకపోయారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసే దమ్ము లోకేష్ కు లేదన్నారు. లోకేష్ నిజంగా నాయకుడైతే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.