నందమూరి బాలయ్యా … జగన్ నుంచి నీకోక గుడ్ న్యూస్ అయ్యా !

balakrishna telugu rajyam

టీడీపీ నేతలకు వైసీపీ మంత్రులు మద్దతిస్తారా అంటే ఇది జరిగే పని కాదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎమ్మెల్యే, స్వయానా చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణకు అనూహ్యంగా మద్దతిస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ఇంతకీ ఏ విషయంలో బాలయ్యకు వైసీపీ నుంచి మద్దతు లభిస్తోందో తెలుసా, బాలయ్యను ఎలాగైనా టీడీపీ అధినేతగా చూడాలనుకుంటున్నారు వైసీపీ మంత్రులు. ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుకేశారు మంత్రి కొడాలి నాని.

బాలయ్యకు వైసీపీ మంత్రులు మద్దతు!

నానికి నందమూరి కుటుంబంపై అభిమానం ఇంకా అలాగే ఉంది. ఎన్టీఆర్ వర్థంతి రోజున కూడా ఆయన నివాళులర్పించి, పనిలో పనిగా చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. ఇక బాలకృష్ణ ఆమధ్య తనపై చేసిన విమర్శలను కూడా నాని అస్సలు పట్టించుకోలేదు. అవకాశం ఉంటే బాలయ్యకు మంచే చేయాలని చూస్తున్నారాయన. బాలయ్యలో నందమూరి పౌరుషాన్ని తట్టిలేపే ఉద్దేశంలో ఉన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్న చంద్రబాబు విషయంలో నందమూరి కుటుంబ సభ్యులు నోరెత్తలేదు. హరికృష్ణ ఎదురుతిరిగినా లాభం లేకుండా చేశారు. అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెంట ఎవరూ లేకుండా ఒంటరిని చేశారు చంద్రబాబు.

అసలా టైమ్ లో లక్ష్మీపార్వతి పేరు చెప్పి బాబు ఆడిన మైండ్ గేమ్ ఎవరూ ఊహించనిది. ఆ ఉచ్చులో చిక్కి బాలయ్య కూడా తండ్రికి జరిగిన అవమానం మరచిపోయారు. పార్టీపై కేవలం నారావారికే సర్వ హక్కులు ఉన్నట్టు పెత్తనం చలాయిస్తున్నారు. ఎప్పుడైనా నందమూరి వారసుల్లో అలజడి రేగితే దాన్ని ఎలా చల్లార్చాలో బాబుకి బాగా తెలుసు. టీడీపీ మునిగిపోయే నావ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ నావ కెప్టెన్ ఇప్పటికీ చంద్రబాబే. టీడీపీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాభవం బాబు హయాంలోనే ఎదురైంది, ఆయన చేయిదాటి లోకేష్ పగ్గాలు చేపడితే.. అసలు టీడీపీకి నామరూపాలు ఉంటాయని కూడా ఎవరికీ నమ్మకం లేదు.

ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. పార్టీని నడిపే సత్తా కాదు కదా, కనీసం నియోజకవర్గ సమస్యలు కూడా తీర్చే సత్తా ఆయన దగ్గర లేదనే విషయం ఈ పాటికే రుజువైంది. అలాంటి వ్యక్తి చేతికి పార్టీ పగ్గాలు వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. అయితే ఒక విషయంలో మాత్రం క్లారిటీ వస్తుంది. టీడీపీ తిరిగి నందమూరి కుటుంబం చేతికి వచ్చినా కూడా జగన్ ముందు నెగ్గుకు రావడం కష్టమే. ఆ విషయం తేలాలంటే ముందు బాలయ్య పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలి. అందుకే కొడాలి నాని, బాలయ్యకు చురుకు పుట్టించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్ష పదవిని బాలయ్య చేపడితే తాను మద్దతిస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తిరిగి కైవసం చేసుకునే హక్కు బాలయ్యకు మాత్రమే ఉందన్నారు. మరో మంత్రి పేర్ని నాని కూడా దాదాపు ఇదే విధంగా స్పందించారు.