వాలంటీర్లను పీకేస్తాం: మంత్రి ధర్మాన హెచ్చరిక.!

AP Minister Dharmana

ప్చ్.! వాలంటీర్ వ్యవస్థ మరీ చులకనైపోయింది అధికార వైసీపీకి. రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలిచ్చేశాం.. అని వైసీపీ ఘనంగా ప్రకటించుకుంటోంది. వాలంటీర్లను అలాంటప్పుడు ఉద్యోగులని పేర్కొంటోంది. ఇంకోసారేమో, వాలంటీర్లంటే ఉద్యోగులు కాదు, సేవ చేస్తున్నారని చెబుతుంటుంది ఏపీలోని అధికార వైసీపీ.

‘వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే..’ అని కూడా వైసీపీ నేతలు చెబుతుండడం చూస్తున్నాం. మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు.. అందరిదీ ఇదే మాట. మళ్ళీ ఆ వాలంటీర్లను అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నారు. ‘వాలంటీర్లు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే, పీకి పారేస్తాం..’ అంటూ పలువురు మంత్రులు పలు సందర్భాల్లో హెచ్చరించారు.

తాజాగా, మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లను హెచ్చరించారు. పీకి పారేస్తామన్నారు. వైసీపీ తరఫున పని చేయాలనీ, ప్రభుత్వానికి ఉపయోగపడాలనీ, విపక్షాల కోసం పని చేయకూడదనీ అల్టిమేటం జారీ చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

వాలంటీర్లు, ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం అందుకుంటున్నారు. అంటే, వాళ్ళూ ప్రభుత్వ ఉద్యోగుల కిందనే లెక్క. అలాంటప్పుడు, వాలంటీర్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు పని చేస్తారు.? ప్రభుత్వం తరఫున కదా పని చేసేది.?

వైసీపీ నుంచి వేధింపులు ఎక్కువవుతుండడంతో చాలామంది వాలంటీర్లు, ‘సేవ’ మానేస్తున్నారు కూడా. ఇది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పెద్ద దెబ్బ అవబోతోందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. గౌరవ వేతనం అందుకుంటున్న తమకు కనీసపాటి గౌరవం అధికార పార్టీ నుంచి లభించడంలేదన్నది మెజార్టీ వాలంటీర్ల వాదన.

వాలంటీర్లలో వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా వున్నారు గనుక, వాళ్ళలో అసంతృప్తి అంటే, అది వైసీపీ మునకకు దారి తీస్తుంది.