ఆంధ్ర ప్రదేశ్: రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెడుతున్న ‘టీటీడీ డిక్లరేషన్’ అంశంలో చివరికి ఆయన పంతమే నెగ్గింది. ఈ మేరకు హైకోర్టులో వెలువడిన తీర్పుతో జగన్ కి భారీ ఊరట లభించింది. గతంలో అనేకసార్లు ఈ అంశం తెర మీదకు వచ్చినా, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావటంతో, ఈ విషయం మరింతగా రాజకీయ విమర్శలకు కారణం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ డిక్లరేషన్ ఇచ్చేస్తే అయిపోయే దానికి, ఆయన కూడా పంతానికి పోవటంతో ఈ వివాదం పెద్దది అయ్యింది. ముఖ్యంగా మొన్న తిరుమల భ్రమోత్సవాలు సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే సందర్భంలో ఈ విషయం పెద్ద రచ్చ అయ్యింది.
విపక్షాలు, హిందూ సంఘాలు, జగన్ మోహన్ రెడ్డి తనకు శ్రీవారి మీద విశ్వాసం ఉందని, డిక్లరేషన్ ఇవ్వాలని, ఆయన క్రీస్టియన్ కాబట్టి చట్టాలకు,సాంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని కోరాయి. అయితే ఈ సందర్భంగా టిడిడి చైర్మన్ , మంత్రులు వెల్లంపల్లి, మరో మంత్రి కొడాలి నాని ఆయన డిక్లరేషన్ ఇవ్వరు ఏమి చేస్తారో చేసుకోండి అనే విధంగా మీడియాతో మాట్లాడారు. అలాగే అప్పటి ఈవో కూడా ఈ విషయం పై ఏమి స్పందించలేదు. సీఎం చర్యలపై ఆదేశాలు ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, టిడిపి చైర్మెన్, ఈవోలను బాధ్యులను చేయాలని కూడా కోరారు.
అయితే దీనిపై గతంలో విచారణ చేసిన హైకోర్టు, జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని ఆధారాలు చూపించమని అడిగింది. అయితే ఆయన క్రీస్టియన్ అంటూ, ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవటంతో, హైకోర్టు ఈ పిటీషన్ ని గురువారం నాడు కొట్టేసింది. జగన్ మొహన్ రెడ్డి వ్యక్తిగత హోదాలో కాకుండా, సియం హోదాలో వెళ్ళారు కాబట్టి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పింది. వ్యక్తిగతంగా వెళ్ళిన హిందూమతేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. దీంతో జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి.