ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన వాతావరణం నెలకొందని.. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ కార్యకర్తలు, వారి ఆస్తులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని.. వినుకొండలో జరిగిన దారుణం ఇందుకు ఒక భయంకరమైన ఉదాహరణ అని, పుంగనూరు ఘటన మరో ఉదాహరణ అని వైసీపీ ఆరోపిస్తోంది.
ఇటీవల వినుకోండలో జరిగిన పాశవికమైన చర్య అనంతరం మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా… రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ తెలిపారు. దీనిపై కేంద్ర దర్యాప్తు బృందాలతో విచారణ జరిపించాలని.. ఈ వ్యవహారంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇదే క్రమంలో… ప్రధాని మోడీ అపాయిట్మెంట్ కూడా కోరినట్లు చెప్పిన జగన్.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా.. ఈ నెల 24న ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో… జగన్ తీసుకున్న స్టెప్ ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారనేది చర్చనీయాంశం అవుతుంది.
ఆ సంతతి అలా ఉంటే… రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇందులో భాగంగా… జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అంటూ ఎద్దేవా చేసిన ఆమె… ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఏపీలో కూటమి నెల రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయని.. మూడు అత్యాచారాలు, ఆరు హత్యలుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరిపోయిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, ఆస్తుల ధ్వంసాలపై సరైన వివరణ ఇవ్వని అనిత… రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగే రాజకీయ హత్యలు జరిగాయని చెప్పుకొచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా… హత్యగావింపబడిన నలుగురిలోనూ ముగ్గురు టీడీపీకి చెందినవారే అని ఆమె స్పష్టం చేశారు. దీంతో.. విమర్శలు మరింత తీవ్రంగా తెరపైకి వస్తున్నాయి.
హత్యాలా, రాజకీయ హత్యలా అనే సంగతి కాసేపు పక్కనబెడితే.. ఫైనల్ గా అవి హత్యలు! ఇక ఇటీవల కాలంలో సుమారు నాలుగురు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. అందులో ఓ బాలిక మృతదేహం ఇప్పటివరకూ లభ్యం కాకపోగా.. చివరి చూపుకు కూడా నోచుకోమేమో అనే ఆందోళనలో ఆ బాలిక కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 10 రోజుల తర్వాత వెళ్లి రూ.10 లక్షలు సహాయం ప్రకటించింది.
ఇక మిగిలిన ముగ్గురిలో ఇద్దరు బాలికలు మృతి చెందిన పరిస్థితి. నంద్యాల, తిరుపతి, విజయనగరం, గుంటూరు జిల్లాలో ఈ దారుణాలు జరిగాయి. అయితే… ఇలా అత్యాచారాలకు బలైన బాలికల విషయంలో మాత్రం.. హోంమంత్రి రాజకీయ పార్టీల ప్రస్థావన తేకపోవడం అభినందించదగిన విషయమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నేరాలను నేరాలుగా చూడకుండా… రాజకీయ నేరాలు కాదని సమర్ధించుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయి.. అందులో మృతిచెందిన వారు ముగ్గురు టీడీపీ వారే కావడం గమనార్హం అంటూ అనిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన చూస్తే… కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేదా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు అనిత ఏమి చెప్పాలనుకుంటున్నారు..? అని నిలదీస్తున్నారు!
చనిపోయినవాళ్లు టీడీపీకి చెందినవారే కాబట్టి వీటిపై రాద్ధాంతం అనవసరం అని అనిత చెప్పాలనుకుంటున్నారా.. లేక, ముగ్గురు టీడీపీ వాళ్లు చనిపోయారు కాబట్టి.. ఒక్క వైసీపీ కార్యకర్త చనిపోయినంత మాత్రాన్న నిరసన, ఆందోళన అవసరం లేదని భావిస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరి హోంమంత్రి అనిత ఏమి చెప్పాలనుకుంటున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఫైనల్ గా ఏమి తేల్చాలనుకుంటున్నారు?