ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఫస్ట్ పంచ్ పడింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడం అనూహ్యం. ఈ విషయాన్ని బహుశా చంద్రబాబు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటైన నాలుగో రోజే ధర్మాసనం తీసుకున్న అతి కీలక నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు పార్టీ నాయకులు. ఓ కేసు ఎన్ఐఎ చేతికి వెళ్లడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఉగ్రవాద సంబంధ కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేసే సంస్థ అది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం తరహా కేసులు సాధారణంగా సీబీఐ సమక్షానికి వెళ్తుంటాయి. ఘటన చోటు చేసుకున్నది విమానాశ్రయం లోపల కావడం వల్ల హైకోర్టు ముందు చూపుతో ఈ కేసు విచారణను ఎన్ఐఎకు అప్పగించినట్టుగా భావిస్తున్నారు.
మన రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తును నిషేధించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించిన కేసులను సీబీఐ విచారించాల్సి వస్తే.. ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా న్యాయస్థానాలైనా ఆదేశించి ఉండాలి. ఈ పరిస్థితుల్లో జగన్‌పై హత్యాయత్నం కేసు ఏకంగా ఎన్ఐఎ ముందుకు వెళ్లడం చర్చనీయాంశమే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
ఇప్పటికే సీబీఐని నిషేధించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇక ఎన్ఐఎను కూడా నిషేధిస్తుందా? అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. జగన్‌పై హత్యాయత్నం ఘటనను తెలుగుదేశం పెద్దలు లైట్‌గా తీసుకున్నారు. జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఇందులో చంద్రబాబు కూడా మినహాయింపు కాదు. ప్రచారం కోసమే ఈ దాడి జరిగిందంటూ చంద్రబాబు విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ వెల్లడించారు.
పబ్లిసిటీ, సానుభూతి కోసమే శ్రీనివాసరావు కోడి కత్తితో జగన్‌పై దాడి చేశాడంటూ విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా కూడా ధృవీకరించడం కొసమెరుపు. పోలీసు కమిషనర్ తన దర్యాప్తు పురోగతిని వెల్లడించి 24 గంటలు కూడా గడవక ముందే- ఏపీ హైకోర్టు ఈ కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఓ సంచలనమే.