టెన్త్ ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం !

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులను పాస్ చేశారు. ఇంటర్నల్ మార్క్‌లు, అటెండెన్స్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించారు. అయితే , ఈసారి కూడా క్లాసులు జరగలేదు. ఏపీలో ఇటీవలే పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండు పూటలూ క్లాసులు చెబుతున్నారు. ఐతే సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.

AP class 10th exam dates 2020 released; check timetable here - Times of  India

అందుకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈసారైనా పరీక్షలు జరుగుతుతాయా, లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేశారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ ఐదు నెలలుగా ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సిలబస్ కూడా తగ్గించారు.

కరోనా కారణంగా గత ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించినా.. కరోనా తీవ్రత కారణంగా రద్దు చేశారు. అందరినీ పాస్ చేశారు. గత ఏడాది పరీక్ష పేపర్లు 6కు కుదించగా.. ఈసారి 7కు కుదించారు. సైన్స్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా.. మిగతా సబ్జెక్టులను ఒక్కో పేపర్‌‌గా నిర్వహించనున్నారు. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సిలబస్‌ను కవర్ చేసేందుకు వేసవి సెలవులు లేకుండా తరగతులు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం జూన్ 17 నుంచి నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జులై మొదటి వారంలో పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుండి త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.