నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక ప్రకటనలు చేశారు. అదే విధంగా పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు మరో వరాన్ని బడ్జెట్ లో ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల నిరుద్యోగ భృతిని 2 వేల రూపాయలకు పెంచారు.  ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల అభివృద్ది గురించి నిరంతరం ఆలోచిస్తుందన్నారు. సభలో మంత్రి ఇంకా ఏం అన్నారంటే…

“ ఏపీలో చదువుకున్న యువతీ, యువకులు అధికంగా ఉన్నారు. వారంతా వారి చదువులకు తగిన ఉద్యోగాలు చేయడం లేదు. ఇది బాధాకరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉంది. అందరికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం. యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమకు నచ్చిన రంగాలలో పని చేసుకోవాలి. నేటి కాలంలో ప్రభుత్వ రంగాలతో సమానంగా ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలున్నాయి.

నిరుద్యోగ భృతి ద్వారా వారిని పూర్తిగా ఆదుకున్నట్టు కాదు కానీ కనీసం వారి అవసరాలకైనా ఉపయోగపడుతుందనే ఒక చిన్న ఆశతో ఇస్తున్నవి. ఖచ్చితంగా నిరుద్యోగులంతా ఉద్యోగులుగా మారాల్సిన అవసరం ఉంది. ఉన్న వనరులతో పాటు అదనపు వనరులు కల్పించేందకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు నిర్వహించాం. అదే విధంగా అమరావతి, విజయవాడలలో ఐటి కంపెనీలు ఏర్పడ్డాయి. మరికొన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వీటన్నింటిలో కూడా స్థానికులకే అధిక ప్రాముఖ్యత ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపేలా చేస్తాం. ఇప్పటికే పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్దులు చదువుకునే సమయంలోనే తమ నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణ ఇస్తున్నాం.

చదువుకున్న వారు వారి చదువులకు తగిన పని చేసేలా చూస్తాం. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖలల్లో ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు వేశాం. పోలీసు పోస్టులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, టీచర్లు ఇతర రంగాలలో భారీ నియామకాలు చేపట్టాం. అదే సమయంలో ప్రైవేటు రంగాలలో కూడా అధిక మందికి ఉద్యోగాలు కల్పించేలా చేశాం. సంవత్సర కాలంలో 1 లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా లక్ష్యం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఏపీలో నిరుద్యోగుల సమస్యను తీర్చి వారికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తాం.” అని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

నిరుద్యోగ భృతి పెంచడం పై పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతిని పెంచడం కాదు ఉద్యోగాలు కల్పించాలని పలువురు విపక్ష నాయకులు విమర్శించారు.