వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొందరు టీడీపీ నేతల రాతలు మారిపోయాయి. వారిలో విజయనగరం రాజుల వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు కూడ ఒకరు. వైసీపీ అధికారంలోకి రావడానికి ముందువరకు అశోక్ గజపతిరాజు హవా తారా స్థాయిలో నడిచింది. పూసపాటి వంశానికి ప్రతినిధిగా మాన్సాస్ ట్రస్ట్ సహా అనేక దేవాలయాల ట్రస్టులకు చైర్మన్ గా ఉంటూ వచ్చారు ఆయన. కానీ జగన్ ముఖ్యమంత్రి అవగానే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి కుమార్తె సంచయిత గజపతిని నియమించారు. దీంతో రాజవంశం హక్కులు, అధికారాల మీద అశోక్ గజపతి పట్టు సడలిపోతోంది.
నిజానికి ఆనంద గజపతిరాజుతో విడిపోయాక ఉమా గజపతి వేరొక వివాహం చేసుకున్నారు. అలాంటప్పుడు సంచయిత వారసత్వం చెల్లదని, ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తెదే అసలైన వారసత్వమని అనేవారు లేకపోలేదు. అసలు మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఇంత లోతుగా ఎందుకు కలుగజేసుకుంటోంది, ఒక్కసారిగా సంచయితను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈ పరిణామాలతో పూసపాటివారి వంశంలో విబేధాలు మొదలయ్యాయి. మాటల యుద్దాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం అశోక్ గజపతిరాజును వరుసగా ఇంకొన్ని పదవుల నుండి తొలగిస్తూ వస్తోంది.
తాజాగా రామతీర్థం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో ఇచ్చారు. దీనితో పాటే పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్ పదవుల నుంచి కూడ ఆయన్ను తొలగించారు. సరిగ్గా రామతీర్థంలో రాములవారి విగ్రహం మీద దాడి జరిగిన రెండు మడోలు రోజులకే ఇలా ఆ ఆలయ చైర్మన్ గా ఉన్న ఆయన్ను పక్కనబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. విగ్రహాన్ని ధ్వంసం చేసింది మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్షాల మధ్యన వాడి వేడి విమర్శల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, బీజేపీ నాయకులు అందరూ ఒకేసారి ఆలయ పర్యటనకు వెళ్లడంతో రామతీర్థంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబుతో పాటే ఆనంద గజపతిరాజు కూడ పర్యటనలో పాల్గొన్నారు. ఇది జరిగి కొన్ని గంటలు కూడ కాకముందే ఇలా ఆయన మీద వేటు పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.