ఆంధ్ర ప్రదేశ్ : ఏపీ ప్రభుత్వం కళాశాలల్లో ఫీజులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ట్యూషన్ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.