ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు ఇంటికే వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది జనవరి నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కొత్త విధానం వాయిదా పడింది. జనవరిలో ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు.
ఇప్పటిరే రేషన్ సరుకుల పంపిణీని ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించినా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది.
జనవరి నుంచి డోర్ డెలివరీకి అధికారులు అన్ని సిద్ధం చేశారు. అయితే మినీ ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో డోర్ డెలివరీ విధానాన్ని మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. ఇక డోర్ డెలివరీ విధానం వాయిదా పడిన దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా సరుకులను రేషన్ షాపులకు తరలించి జనవరి 4వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు.