ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయింది. ప్రభుత్వ పధకాలను ప్రజలకు నేరుగా చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సచివాలయ సిబ్బందిగా పెద్ద సంఖ్యలో యువతను నియమించింది. ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 179 వార్డు సచివాలయాలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 884 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిల్లో సుమారు 8535 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థలో పలు మార్పులు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగానే ఇకపై సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మొదటిగా ఒకటి లేదా రెండు జిల్లాల్లోని రెండు సచివాలయాలను ఎంపిక చేసి.. అక్కడ పని చేస్తున్న సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయబోతుంది. ఆ సచివాలయాల పరిధిలోని ప్రజలు సిబ్బంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్ బిస్కెట్ కలర్ ప్యాంట్ మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్ బిస్కెట్ కలర్ లెగిన్ను డ్రస్ కోడ్గా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.
సచివాలయాల్లో డ్రస్ కోడ్ ను అమలు చేయనున్న నేపథ్యంలో ఏ క్యాడర్ కు చెందిన సిబ్బంది ఎవరన్న విషయాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్ లను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. వార్డు సచివాలయాల్లో దాదాపు పది విభాగాలకు చెందినవారు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు ధరించేందుకు ట్యాగ్లను వినియోగిస్తారు. ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్ డిజిటల్ అసిస్టెంట్కు రెడ్ ట్యాగ్ హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్ మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్ వీఆర్ ఓకు బ్రౌన్ ట్యాగ్ అగ్రికల్చరల్ హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు గ్రే ట్యాగ్ ఇవ్వనున్నారు.