ఆంధ్రప్రదేశ్ వరదలు: పవన్ కళ్యాణ్ ఎక్కడ.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద రాజకీయం నడుస్తోంది. విపక్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలతో బిజీగా వున్నాయి. అధికార పార్టీ కూడా, వరద ప్రభావిత ప్రాంతాల్లో చెయ్యగలిగినదంతా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని పార్టీలూ కలిసి వరదలో రాజకీయాన్ని వెతుక్కుంటున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలతో బిజీగా వున్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు జనంలో వున్నారు. ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.? తన తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ వ్యవహారాలతో బిజీగా వున్నారనే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

జనసేన పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ మాత్రం జనంలోనే వున్నారు. పలువురు జనసేన నేతలు, వరద ప్రభావిత జిల్లాలైన కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరుల్లో పర్యటిస్తున్నారు. జనసైనికులు, జనసేన నేతలతో కలిసి నాదెండ్ల మనోహర్ వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు.

అయితే, జనసేన అధినేత సూచన మేరకే నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారన్నది సుస్పష్టం. మరి, ఆ విషయం జనసేన అధినేత మీడియా ముందుకొచ్చి చెప్పొచ్చు కదా.? వీలైతే, తానే స్వయంగా రంగంలోకి దిగి, బాధితుల వెతల్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవచ్చు కదా.?

ఈ విషయమై జనసైనికుల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు జనసేన అధినేత, బాధితుల్ని స్వయంగా పరామర్శించారు, ఆర్థిక సహాయం కూడా వ్యక్తిగతంగా ప్రకటించారు. మరిప్పుడు పవన్ ఎందుకు అలా స్పందించలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.