ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకా వేయాల్సిన సమయంలో ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పినప్పటికీ… ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉద్యోగుల సంఘాలు తప్పుపట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని అన్నారు. లేనిపక్షంలో తాము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని తేల్చి చేప్పేశారు ఉద్యోగులు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిందని ఆరోపిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. కాగా, నాలుగు దశలుగా ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23 తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.