ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , అధికారంలోకి వచ్చేది తడువు నేటి వరకు వరుసగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే ఉన్నాడు. ఏపీ లోటు బడ్జెట్ లో కొనసాగుతున్నా కూడా సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా అమలు చేస్తూనే ఉన్నాడు. ఇక జగన్ శ్రమ కళ్లకు కట్టేలా ఫోటోగా దీన్ని చెప్పాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే రేషన్ బియ్యాన్ని లబ్థిదారుల ఇళ్లకే పంపిణీ చేసే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన జగన్ ప్రభుత్వం, అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు చేశారు.
రేషన్ బియ్యాన్ని.. నేరుగా లబ్థిదారుల ఇళ్లకు చేర్చే వాహనాల్ని సిద్ధం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేసే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు.. తాజాగా అందుకు అవసరమైన వాహనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా సమకూర్చుకుంది. ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేలా వినూత్న డెలివరీ విధానాన్ని సిద్ధం చేసిన ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లే రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాల్ని సిద్ధం చేసింది.
ప్రత్యేక వాహనాలతో ఇంటి వద్దకే రేషన్ సరుకుల్ని డెలివరీ చేసే ఈ విధానం కోసం మూడు జిల్లాలకు సంబంధించిన 2500 రేషన్ వాహనాల్ని విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఒకేచోట 2500 వాహనాల్ని సిద్ధం చేసిన సీన్ ను చూస్తే.. మార్పు కోసం జగన్ ప్రభుత్వం ఎంతలా తపిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. గతంలో అంబులెన్సుల ఆవిష్కరణ కూడా ఇలాగే చేశారు. ఇపుడు మళ్లీ అదే తరహా లో ఈ వాహనాల ప్రారంభం కూడా చేశారు.