ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళకూడదా.?

రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమాఖ్య స్ఫూర్తి వుండాలి. రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయాలి.. కేంద్రంతో కలిసి రాష్ట్రాలు పని చేయాలి. ప్రధాన మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా.. అంతిమంగా ప్రజా సేవకులే. ‘పాలకులు’ అన్నది కేవలం ఓ ప్రస్తావన మాత్రమే. కానీ, అందరూ ప్రజా సేవకులేనని అధికారంలో వున్నోళ్ళు గుర్తంచుకోవాలి.

అధికారంలో వున్నప్పుడు, ఢిల్లీ వెళ్ళడాన్ని ఓ ఘనకార్యంగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ, అధికారం పోగానే, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం ఓ నేరంగా పరిగణిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళితే సంబరపడిపోయిన పచ్చ మీడియా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళితే గగ్గోలు పెడుతోంది.

కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. అంటోంది టీడీపీ. మరి, చంద్రబాబు ఏ కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళారట.! ఇక్కడ, కేంద్రం తప్పిదం కూడా లేకపోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి, ప్రధాన మంత్రితో భేటీ అయినప్పుడు.. ఆ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందీ, కేంద్రం సవివరంగా పేర్కొనాలి కదా.?

ముఖ్యమంత్రి చేసిన విజ్ఞాపనలపై ప్రధాన మంత్రి స్పందించాలి. కానీ, ఆయన స్పందించడంలేదు. అదే అసలు సమస్య. కేంద్ర మంత్రులూ పెదవి విప్పరు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతోంటే.. దాన్ని బానిసత్వంగా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఎంతకాలం ఈ నిరంకుశత్వం.? దీన్ని రాష్ట్రాలన్నీ కలిసే ప్రశ్నించాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?