రోజులు మారాయి.. నేతలు తప్పులు చేస్తే ప్రజలు లైట్ తీసుకునే పరిస్థితులు ఇప్పుడు కానరాకున్నాయి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచినా, తాము మహారాజులం అన్నట్లుగా ప్రవర్తించినా ఓటుతో వారు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. తాజాగా వైసీపీకి తగిలింది అలాంటి దెబ్బే. ఫలితంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది.. గతంలో ఎన్నడూ లేనంత విపక్షం ఇప్పుడు ఏపీలో ఉంది.
అయితే ఏపీలో విపక్షం వీక్ గా ఉందని.. కూటమి ప్రభుత్వం 2014 తరహా పాలన అందించాలని కానీ, ప్రజలను ఏమార్చాలని కానీ ఆలోచించి.. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను పక్కన పెట్టినా, చెప్పిన మాటలు పక్కన పాడేసినా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఈ ఉపోద్ఘాతం అంతటికీ కారణం చంద్రబాబు ఎన్నికల్లో చెప్పినదానికి ఇప్పుడు చేస్తున్నదానికీ పొంతన లేకపోవడమే.
వైఎస్ జగన్ అప్పు చేసి పప్పుకూర వండుతున్నారు.. అప్పులు చేసి జనాలకు డబ్బులు పంచుతున్నారు.. ఫలితంగా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చింది. కట్ చేస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఇప్పటికే 7వేల కోట్లు అప్పుగా తీసుకొచ్చారు. అందులో రూ.4,400 కోట్లు పెన్షన్స్ కింద పంపిణీ చేశారు.
మిగిలిన మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు, ప్రభుత్వం నిర్వహణ, ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చారు. అంటే… అప్పుగా తెచ్చిన రూ.7వేల కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. దీంతో మంగళవారం మళ్లీ అప్పుల కోసం పరుగెట్టాల్సిన పరిస్థితి నెలకొంది! కారణం… రాబోయే మరో 20 రోజుల అనంతరం మరో 3,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎదురుచూస్తోంది.
అంటే… ప్రభుత్వం ఈ నెలలో మరికొన్ని వేల కోట్లు అప్పులు చేయబోతోందన్నమాట. అంటే… గతంలో జగన్ పై ఏవైతే ఆరోపణలు, విమర్శలూ చేశారో.. ఇప్పుడు అవే ఆరోపణలు, విమర్శలు చంద్రబాబు ముందు కనిపిస్తున్నాయన్నమాట. ఈ సమయంలో గతంలో లాగానే విపక్షం వీక్ గా ఉంటే ఉండొచ్చు కానీ… ప్రజలు మాత్రం వీక్ గా లేరనే విషయం బాబు & కో మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోకపోతే సమస్యలు తప్పవు.
ఈ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఎమ్మెల్యేల జీతాలకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే… ఇంకా సూపర్ సిక్స్ అంటూ భారీ ఖర్చులతో కూడిన పథకాలు ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా… బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుకు పెట్టుబడి సాయం, ఏడాదికి మూడు సిలెండర్లు, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, 18ఏళ్లు దాటిన రూ.1500 మొదలైన ఎన్నో హామీలు ఎదురుచూస్తున్నాయి.
మరోపక్క ఉచిత ఇసుక హామీతో ఆ ఆదాయానికి గండి పడింది.. జగన్ కు పెద్ద డ్యామేజీ కలిగించిన లిక్కర్ ధరలు ఇంకా తగ్గించినట్లు లేదు! విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. పైగా ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రత్యేకంగా హనీమూన్ పిరియడ్ ఉంటుందనే అది ఆయన స్థాయికి అవమానం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం పెండింగులోనే ఉంది. ఈ విషయాలన్నింటిపైనా ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైపోయింది. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని జగన్ & కో భావించినా… ప్రజలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రైతులు పనులు ప్రారంభించేశారు.. స్కూల్స్ ప్రారంభమైపోయాయి. మరి చంద్రబాబు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు.. సంపద ఎప్పటి నుంచి సృష్టిస్తారు అనేది వేచి చూడాలి!
ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీన్ని బట్టి అదుపు తప్పకుండా, అప్పులు పెద్ద మొత్తంలో తీసుకురాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యతగా చెప్పాలి. ఇలా అడుగులు వేస్తేనే జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే జగన్ పాలనను విమర్శించిన చంద్రబాబు కూడా అదే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.