కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం, విద్యార్థుల ఉద్యమం ఎఫెక్ట్

కడప జిల్లాను రాజకీయంగా కైవసం చేసుకునేందుకే అయినా, కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్యాబినెట్ సమావేశమయి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు 15 నుంచి 18 వేల కోట్ల వ్యయం అవుతుందని  కేబినెట్ అంచనా వేసింది. ఈ నిధులను బ్యాంకుల నుంచి రుణ రూపంలో సమీకరణ చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.  3 మిలియన్ టన్ను ల సామర్ధ్యం తో ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ముడి ఖనిజ నిల్వలు ఉన్నందున రుణం మంజూరు అవుతుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇది ఎన్నికల కోసమే తీసుకున్న నిర్ణయంగా కనిపించినా,  ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, పొద్దుటూరు కేంద్రంగా గత నాలుగు  సంవత్సరాలుగా యువకులు, విద్యార్థులు సాగిస్తున్న ఉద్యమమే. ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే ఇంజనీరింగ్ పట్టభద్రుడు ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ సాధన సమితిని ఏర్పాటుచేసి విద్యార్థులను యువకులను సమీకరించి నాలుగేండ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రవీణ్ పేరుచివరకు ఉక్కు ప్రవీణ్ గా మారిపోయింది. ఒక్క రాజకీయ పార్టీ కూడా  ఈ పోరాటానికి మద్దతునీయకపోయినా, ఒక స్థానిక నేత కూడా పాల్గొనకపోయినా బడి, కాలేజీ పిల్లలను వెంటేసుకుని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని నడిపారు. ప్రొద్దుటూరులో ఏంజరుగుతూ ఉందని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తేరిపార చూసేలా చేశారు. మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేసిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా ఎపుడూ ప్రొద్దుటూరు ఉద్యమంలో పాల్గొనలేదు. మద్దతునీయలేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏవరూతనతో రాకపోయినా ప్రవీణ్ ఈ ఆద్యమాన్ని నిడిపారు, పొద్దుటూరు వీధులను దిగ్బంధం చేశారు. ర్యాలీలు నిర్వహించారు. బహిరంగ సభలు పెట్టారు. అన్నింటా పాల్గొన్నది విద్యార్థులు నిరుద్యోగులే. అదే విధంగా ఉద్యమం పేరుతో చందాల కోసం ఎపుడూ స్టీల్ ప్లాంట్ సాధన సమితి రోడ్ల మీద పడలేదు.  ఇంత క్రమశిక్షణ తో ఒక ఉద్యమం నడవడం చాలా కష్టం.

స్టీల్ ప్లాంట్ వస్తే ప్లాంటు చుట్టూర కనీసం వందకిలోమీటర్ల మేర వ్యాపార వర్తకాలు పెరుగుతాయని,, స్టీల్ టౌన్షిప్ తయారవుతుందని, పదివేల ఉద్యోెగాలు ప్రత్యక్షంగా, మరొక పదివేలు పరోక్షంగా వస్తాయని, ఈ కుటుంబాలకు పాలు, కూరగాయలు, బట్టలు, నగలు, ఆసుపత్రులు, హోటళ్లు అవసరమయి ఈ ప్రాంతమంతా ఆర్థిక కార్యకలాపాలతో కళకళలాడుతుందని ప్రవీణ్ పొద్దుటూరు పరిసరాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్లాంటు రాావాలి, ఉద్యోగాలు రావాలి అంటే చందాలు వద్దు, ప్రతిఇంటినుంచి ఒకరు వచ్చి ఈ శాంతియుత ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అలాగే జరిగింది. కడప ఉక్కు, సీమహక్కు నినాదమయింది. అది  ప్రొద్టుటూరులో మారుమ్రోగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని ఉద్యమం ఆపేయమన్నాడు.  ప్లాంటుకు శంకుస్థాపన చేస్తేనే ఆపేస్తానని ప్రవీణ్ ధైర్యంగా చెప్పాడు.

దీనిఫలితమే ఇపుడు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం. ఇది నిర్ణయంగా ఫైలుకే పరిమితం కాకుండా కార్యరూపం దాలుస్తుందని ఆశిద్ధాం. ప్రవీణ్ కుమార్ రెడ్డికి, ప్రవీణ్ సేనకు అభినందనలు చెప్పకుండా ఉండలేేం. ఈ ఉద్యమంలోకి పట్ణణంలోరి వర్తక వాణిజ్య సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలు అన్నింటిని తీసుకురావడంలో ప్రవీణ్ విజయవంతమయ్యారు. ఆయన చేదోడు వాదోడు విద్యార్థులను సమీకరించడంల్  వై అమర్ నాథ్ రెడ్డి, మేధావి ఎన్ ఎస్ కళందర్,  స్థానిక నాయకుడు ఆర్ ఓబుల్ రెడ్డి నిలబడ్డారు. 

ఈ సందర్భంగా తెలుగు రాజ్యంతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీన్ కుమార్ రెడ్డి ఉద్యమం పూర్తి కాలేదని చెప్పారు.

ఇది కేవలం క్యాబినెట్ ఆమోదం మాత్రమే. ఈ ఆమోదం కార్యరూపం దాల్చి, శంకుస్థాపన జరిగి, స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే దాకా ఉద్యమం రూపంలో ప్రభుత్వం మీద వత్తిడితెస్తూనే ఉంటామని ప్రవీణ్ చెప్పారు.

ఉద్యమంకొనసాగుతుందని కూడా ఆయన చెప్పారు.