షాకింగ్ న్యూస్.. నకిలీ చెక్కుల స్కాంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేనా.. ??

 

వైసీపీలో మరో వివాదం రాజుకుంది.. సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల విషయంలో వస్తున్న వార్తలను ఖండిస్తూ, ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తాను తప్పుచేశానని రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. అంతేకాదు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.. ఇకపోతే టీడీపీకి అడ్డాగా మారిన ఓ పత్రిక సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల కుంభకోణంలో తన ప్రమేయం ఉందని రాసుకొచ్చింది.. ఒకవేళ ఆ పత్రిక రాసింది నిజమని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్దమే.. కానీ నిజానిజాలు గ్రహించకుండా కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతగా అనుమానాలుంటే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు..

తన కార్యాలయంలో పనిచేస్తున్న చెన్నకేశవరెడ్డిని కొందరు ప్రలోభాలకు గురిచేసి, సీఎంఆర్‌ఎఫ్‌ పాత చెక్కులు తీసుకున్న మాట వాస్తవమేనని.. కాగా అందులో నుండి మూడు చెక్కులకు సంబంధించి రూ.9 లక్షల 90 వేలు డ్రా చేసుకున్నారని, ఓ ట్రస్టు పేరు చెప్పుకుని మిగతా చెక్కులతో రూ.40 కోట్లకు పై పైకాన్ని డ్రా చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో నకిలీ చెక్కుల బాగోతాన్ని అధికారులు కనిపెట్టారని చెప్పుకొచ్చారు.. ఈ విషయంలో నిందితునిగా తేలిన చెన్నకేశవరెడ్డిని తామే పోలీసుల ఎదుట హాజరు పరచి విచారణకు సహకరించామన్నారు.

ఇక సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల స్కాం గురించి తెలియగానే చెన్నకేశవరెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలియచేశారు.. కాగా ఈ కుంభకోణంలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కీలకపాత్ర పోషించాడని అతన్ని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఈ లోపలే తనపై బురద జల్లే కార్యక్రమానికి కొందరు శ్రీకారం చుట్టారని తమ పార్టీ పేరును చెడగొట్టడానికే ఈ కుట్ర చేస్తున్నారంటు కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు..