“యువగళం” పాదయాత్రతో ఫుల్ జోష్ లో ఉన్న నారా లోకేష్… కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోయారు! అయితే… తర్వాత ఏమైందో ఏమో కానీ… మహానాడు వేదికగా వారందరికీ షాక్ ఇచ్చారు.. వెక్కిరించినంత పనిచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసేది, ప్రకటించేది చంద్రబాబు నాయుడే అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే లోకేష్ ఖరారు చేసిన అభ్యర్థులు… షాక్ తిన్నారు.
అయితే తాజాగా మరోసారి అలాంటి పనుకే పూనుకుంటున్నారు చినబాబు. దీంతో… నమ్మొచ్చా..? లేక, చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు స్థానిక కేడర్. వివరాళ్లోకి వెళ్తే… యువగళం పాదయాత్ర ప్రస్తుతం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ “అభ్యర్థి”పై స్పష్టత ఇచ్చారు.
ఈ సందర్భంగా మైకందుకున్న చినబాబు… “ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్లింది ఈ ప్రవీణ్. నందం సుబ్బయ్యను అతి కిరాతకంగా చెప్పేస్తే అండగా నిలబడింది ఈ ప్రవీణ్. ఈ వేదికపై నుంచి యువ పౌరుషాన్ని నేను చూశా. యువరక్తం నేను చూశా. రేపు ఇక్కడ యువతను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై కూడా వుంది” అని ప్రవీణ్ ను చూపిస్తూ, ఒకసారి ఆయన చెయ్యి పైకి లేపుతూ పరోక్షంగా స్పష్టం చేశారు.
అంటే… యువనాయకుడైన ప్రవీణ్ రెడ్డికే టిక్కెట్ కన్ ఫాం అని లోకేష్ ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసినట్లే అని కేడర్ ఫిక్సయ్యారు. అయితే ఈ సమయంలో అదే వేదికపై ఉన్న సీనియర్ నాయకులు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మాత్రం సీరియస్ హావభావాలతో నిలబడిపోయారు! దీంతో ఇంకా ఎంతో సమయం ఉండగానే అభ్యర్థిని ప్రకటించడం ఏంటి? పైగా అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తారని మహానాడులో చెప్పారుగా.. అంటూ సీనియర్ నాయకుల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
మరి లోకేష్ కన్ ఫాం చేసిన ఈ అభ్యర్థిత్వమైనా ఫైనలేనా.. లేక సీనియర్ లీడర్ల ఒత్తిడి మేరకు మరోసారి సారీ చెబుతారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ఏది ఏమైనా… ఈ పాదయాత్ర పుణయమాని, తన అత్యుత్సాహంతోనో, అనుభవరాహిత్యంతోనో పార్టీకి కొత్త కష్టాలు తెచ్చేలా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!