కేసీఆర్ రాజకీయ చతురత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టడంలో ఆయన దిట్ట. కేవలం మాటలతోనే అవతలి పార్టీలను నీరుగార్చేసే నేర్పు ఉంది ఆయనలో. ఎంత ప్రతికూల పరిస్థితి అయినా నెగ్గుకురాగలరు. ఇక ఆయన పార్టీలో మహామహులు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలే అందరూ. ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ తరహాలో ఫీలైపోతుంటారు. పైగా ఉద్యమ నేపథ్యం ఒకటుంది ఆయనకు. అలాంటి బలమైన కేసీఆర్ నే బీజేపీ బెంబేలెత్తించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని తెరాస వశం కాకుండా తన్నుకుపోయింది. ఇది ఒక్క అసెంబ్లీ స్థానమే కావొచ్చు, అది పోవడం వలన కేసీర్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేకపోవచ్చు. కానీ పార్టీ పరంగా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.
ఇదంతా బీజేపీ యుద్ధ తంత్రమే. తాము ఏం చేస్తామో చెప్పకుండా కేసీఆర్ ఏం చేయలేదో వివరిస్తూ గెలిచేశారు. ఆ గెలుపుతో బీజేపీ కొండంత బలాన్ని పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అనే స్థాయికి వెళ్లిపోయారు. అలా కేసీఆర్ నే బోల్తా కొట్టించిన కమలానికి జగన్ పెద్ద లెక్క కాదనే చర్చ నడుస్తోంది. జగన్ బలమైన నాయకుడే కావొచ్చు. 151 ఎమ్మెల్యేలు బలం ఉండొచ్చు. కానీ క్షేత్ర స్థాయి అనుభవం ఆయనకు తక్కువ. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే విజుబిలిటీ ఆయనకు లేదు. అందుకు సాక్ష్యమే ప్రస్తుతం పార్టీలో లేస్తున్న అంతర్గత కలహాలు. వీటి మీదనే బీజేపీ గురిపెట్టబోతోంది. భారీ వాల్యూమ్ ఉన్న వైసీపీలో చాలామంది బలమైన లీడర్లు ఉన్నారు. వారిలో చాలామందికి పదవులు లేవు. పనులు చేసుకునే స్వేచ్ఛ కూడ లేదు. అందుకే అసంతృప్తిగా ఉన్నారు.
సరైన ప్రత్యామ్నాయం కనిపించట్లేదు కానీ లేకుంటే చాలామంది లీడర్లు జెండా ఎత్తడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ భరోసా కల్పించే పనిలో ఉంది రాష్ట్ర బీజేపీ. కేంద్రం వైపు చూపించి భవిష్యత్తు మండే అంటున్నారు. కుల సమీకరణాలు చేస్తూ ప్రధాన సామాజికవర్గాల నుండి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తన జట్టులో చేరితే అన్ని ప్రయోజనాలు ఉంటాయని నమ్మబలుకుతున్నారు. ఇప్పటికే కొందరిని కన్విన్స్ చేసినట్టు వార్తలు వినబడుతున్నాయి. అందుకు నిదర్శనమే తిరుపతి ఉప ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారని బీజేపీ నేతలు అనడం. జగన్ ఏమో ఇప్పటికీ వారి మీద మెతక వైఖరితోనే ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ కూడ కేసీఆర్ తిన్నట్టే బీజేపీ చేతిలో పెద్ద షాక్ తినాల్సి రావొచ్చు.