కామెడి: కుటుంబపార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదు!

గతకొంతకాలంగా బీజేపీ నేతలు ఒక కొత్త లాజిక్ తీస్తున్నారు. అదేంటంటే… “కుటుంబపార్టీలు, కుటుంబరాజకీయాలు సమాజానికి చేటు తెస్తాయి.. కుటుంబపార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదు” అని! ఇది విన్న తర్వాత ఇది కొత్త లాజిక్ కాదు.. చెత్త లాజిక్ అంటున్నారు విశ్లేషకులు! అసలు బీజేపీ చెబుతున్నదానికి – ఇంతకాలం చేసినదానికి, చేయబోతున్న దానికీ ఎంతపొంతన ఉందో ఇప్పుడు చూద్దాం!

మహారాష్ట్రలో గతంలో శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీహార్లో జేడీయూ, ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా గతంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇపుడు తమిళనాడులో మరో ప్రాంతీప పార్టీ అయిన ఏఐఏడీఎంకే కూడా బీజేపీ మిత్రపక్షమే! ఇపుడు యూపీలో పొత్తున్న అప్నాదళ్ కూడా కుటుంబపార్టీయే. నాగాల్యాండ్ త్రిపుర మేఘాలయలో పొత్తులు పెట్టుకున్న పార్టీలు కూడా ప్రాంతీయపార్టీలే. అంటే… కుటుంబపార్టీలే!

ఇక తెలుగురాష్ట్రాల విషయానికొస్తే… ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. రాబోయే ఎన్నికలకు కలిసే వెళ్తామని బల్లగుద్ది చెబుతుంది. మరి జనసేన కుటుంబపార్టీ కాదా? ప్రాంతీయపార్టీ కాదా? ఆ సంగతి అలా ఉంచితే… ఒకపుడు ఏపీలో బీజేపీ పొత్తుపెట్టుకుని – అధికారాన్ని పంచుకున్న తెలుగుదేశంపార్టీ.. కుటుంబ పార్టీ కాదా? ప్రాంతీయపార్టీ కాదా? లేక, అప్పట్లో టీడీపీ కుటుంబపార్టీ అని బీజేపీకి తెలీయదా.. గుర్తులేదా.. మరిచిపోయారా?

అంటే… బీజేపీకి రాజకీయంగా గత్యంతరం లేక, ప్రాంతీయపార్టీల సహాయసహకారాలు అవసరమైనప్పుడు.. కుటుంబపార్టీలనే టాపిక్ ఉండదు! ఆ అవసరం లేనప్పుడు, లేదనుకున్నపుడు మాత్రం ప్రాంతీయపార్టీలు – కుటుంబపార్టీలు అనే విషయం గుర్తుకురావడంతోపాటు.. అవి సమాజానికి హానికరమనే సంగతి కూడా సృహలోకొస్తుందన్నమాట! అలా ఉంది బీజేపీ రెండునాల్కల ధోరణి!