ఏపీ అసెంబ్లీ: రచ్చహ.. రచ్చస్య.. రచ్చోబ్యహౖ

AP Assembly Winter Session 2020

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో అద్బుతాలేం జరగడంలేదు. అంతకు మించి అనే స్థాయిలో రచ్చ మాత్రమే జరుగుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం.. దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కొత్తగా ఏమైనా ప్రజలు ఆశిస్తున్నారా.? అంటే, ఏమో.. జనం ఆశించడంలేదేమో, అందుకే శాసన సభ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో దూషణలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతోంటే స్పీకర్‌ ఏం చేస్తున్నట్లు.? అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షంపై విరుచుకుపడుతోంటే అలా వింటూ ఊరుకుంటున్నారు..

AP Assembly Winter Session 2020
AP Assembly Winter Session 2020

అదే, ప్రతిపక్షం మాటల దాడికి యత్నిస్తే.. వారిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు.. సస్పెండ్‌ కూడా చేసేస్తున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరుగుతోంది. అధికారంలో ఎవరున్నా, స్పీకర్‌ ఛెయిర్‌లో ఎవరు కూర్చున్నాసరే, పరిస్థితి మారదంతే. మారుతుందని ఎవరైనా ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

చంద్రబాబు హయాంలో ఇళ్ళు కట్టేశారుగానీ..

సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పసుపు, కుంకుమ పథకం ప్రకటించేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాంటిది, తన హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయితే ఆగుతారా.? ఆ ఇళ్ళను లబ్దిదారులకు ఇచ్చేసి, ఓట్లు ఆశించెయ్యరూ.! కానీ, చంద్రబాబు అలా ఆ ఇళ్ళను ఇవ్వలేదంటే, అందులో ఏదో మతలబు వుంది. అదేంటన్నది చంద్రబాబూ చెప్పరు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా చెప్పరు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయ్యింది. ఇప్పటికీ ఆ ఇళ్ళు లబ్దిదారులకు దక్కలేదు. అంటే, వెనకాల ఏదో పెద్ద రాజకీయమే నడుస్తుండాలి. కానీ, ఆ వివరాలు చెప్పకుండానే ఇటు చంద్రబాబు అటు వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసేసుకున్నారు.

చంద్రబాబుని మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించెయ్యాలి..

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంయమనం కోల్పోయారు. ‘ఈ వ్యక్తిని మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్చెయ్యాలి..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ప్రతిపక్ష నేత ఎంత గొడవైనా చేసి వుండొచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు అంతలా ఆవేశపడటాన్నీ సమర్థించలేం. కానీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఏమయ్యింది.? చంద్రబాబు ట్రాప్‌లో పడిపోతూ, సంయమనం కోల్పోతే ఎలా.? లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశం అసెంబ్లీ సమావేశాలంటే. అక్కడేం జరుగుతుందన్నది రాష్ట్ర ప్రజల మైండ్‌లోకి ఖచ్చితంగా వెళుతుంది. ఎవరు ఎవర్ని ఏమని సంబోదిస్తున్నారో, ఏమని తిడుతున్నారో జనం చూస్తున్నారు.

ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు చేసింది తక్కువేమీ కాదు

తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు తక్కువేమీ చేయలేదు. వైఎస్‌ జగన్‌పై దూషణలకు దిగేలా తమ శాసన సభ్యుల్ని ఉసిగొల్పారు. దానికి రివెంజ్‌ తీర్చుకుంటున్నారు వైఎస్‌ జగన్‌. అయితే, ముఖ్యమంత్రి హోదాలో వుండి ఇలాంటి వ్యాఖ్యలు వైఎస్‌ జగన్‌ చేయడం సమర్థనీయం కానే కాదు. అసెంబ్లీ వ్యూహాల పరంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తప్పటడుగు వేస్తున్నారంటే.. అది బహుశా చంద్రబాబు వ్యూహాల కారణంగానే అయి వుండొచ్చు.