చంద్రబాబు-జగన్ మధ్య సవాళ్ల యుద్ధం.. హీట్ పెట్టిస్తున్న ఏపీ రాజకీయాలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సవాల్ విసరగా, జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రతిస్పందన కూడా అంతే ఘాటు గానే వినిపిస్తోంది. సభ వేదికపై హాజరు, ప్రతిపక్ష హోదా వంటి అంశాల చుట్టూ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి “ఫేక్ ప్రచారం చేయడం మానుకోండి, నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. అక్కడే తేల్చుకుందాం అంటూ గట్టి సవాల్ విసిరారు. ఇక వైసీపీ మాత్రం తమ డిమాండ్ మీదే నిలబడి.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేదంటే సభకు వెళ్లే ప్రసక్తే లేదు అంటూ రివర్స్ అటాక్ చేసింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాను కాదని, ప్రజలే ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారన్న కౌంటర్‌ను చంద్రబాబు ఇచ్చారు.

ఇక అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ సమయం ఇస్తానని చెప్పినా.. ప్రతిపక్ష హోదా విషయంపై మాత్రం నిశ్శబ్దంగా ఉండటంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే జగన్ అసెంబ్లీ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ వాదన ఏమిటంటే.. ప్రతిపక్ష హోదా ఉంటేనే నాయకుడికి ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. లేకపోతే సాధారణ ఎమ్మెల్యేగా ఇచ్చిన కొద్ది సమయం తప్ప మరేమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం హోదా అనేది ప్రజల తీర్పుతో వస్తుంది.. తాను ఇవ్వగలిగేది కాదని తేల్చేశారు.

ఈ సారి అసెంబ్లీలో కూటమి సభ్యులు అనేక అంశాలను లేవనెత్తబోతున్నారు. జగన్ హయాంలో జరిగిన వివాదాలు, రుషికొండ భూకుంభకోణం, సుగాలి ప్రీతి కేసు, పర్యటనల ఖర్చులు ఇలా పలు అంశాలు హాట్ టాపిక్ అవ్వబోతున్నాయి. వైసీపీ మాత్రం అసెంబ్లీ బహిష్కరణతో పాటు ప్రెస్‌మీట్ల ద్వారానే స్పందించేలా వ్యూహం వేసుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత వాస్తవ సన్నివేశం ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం .. ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.