ఏపీ ఎన్నికలు… ఈ అరడజను అంశాలే అత్యంత కీలకం!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యలో ఏపీ రాజకీయాలు మరింత హోరెత్తిపోతున్నాయి. పైగా ఈ నెలలోనే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు యాత్రల పేరుతో జనాల్లోకి రానుండటంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కబోతున్నాయి. ఇక, ఇప్పటికే ఏపీలో బీజేపీ – టీడీపీ – జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడగా.. తాను సింగిల్ గానే వస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ సమయంలో రానున్న ఎన్నికల్లో ఆరు అంశాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయని తెలుస్తోంది!

అవును… ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు పార్టీల అధినేతలూ ప్రచారాలకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న వైఎస్ జగన్ “మేమంతా సిద్ధం” అని, అదే రోజు నుంచి చంద్రబాబు “ప్రజా గళం” అని, ఇక పవన్ కల్యాణ్ ఈ నెల 30 నుంచి “వారాహి యాత్ర” ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. వారి ప్రచార కార్యక్రమాల సంగతి అలా ఉంటే… రానున్న ఎన్నికల్లో ప్రధానంగా అరడజను అంశాలు కీలకంగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఏపీకి ప్రత్యేక హోదా:

రానున్న ఎన్నికల్లో ఏపీలో ప్రత్యేక హోదా అనే అంశం కూడా కీలకం కాబోతోంది. వ్యూహాత్మకంగా.. “హోదా వద్దు ప్యాకేజీ ముద్దు” అంటూ 2014 ప్రభుత్వం ఈ అంశాన్ని వెంటిలేటర్ పైకి పంపేసినా.. బీజేపీకి కేంద్రంలో ఉన్న బలమైన మద్దతు మేరకు జగన్ అవసరం వారికి నాడు లేకపోవడం వల్ల అది పాతబడిన విషయంగా అనిపించినా… కాంగ్రెస్ పార్టీ ఎంటరై ఆ విషయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ తొలిసంతకం ఏపీకి ప్రత్యేక హోదాపై అని చెప్పింది.

దీంతో.. ఏపీ హోదా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు జగన్ కంటే ఎక్కువగా ఆ ఈ విషయంపై బలమైన, స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన బాధ్యత కూటమిపై పడిందనే చెప్పాలి. ఇటీవల జరిగిన చిలకలూరి పేట సభలో మోడీ నోట అలాంటి మాటలేమీ రాలేదు. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ లు కూడా స్పందించలేదు. దీంతో.. ఈ కూటమి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప.. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి మాటలు హంబక్కు అని ప్రజలు భావించే ప్రమాదం ఉంది!

ఈ విషయంలో మోడీతో టీడీపీ, జనసేనలు ఎంత బలంగా మాట్లాడించగలుగుతాయనేదీ ఇప్పుడు అత్యంత ప్రధాన అంశంగా మారింది.

ఏపీకి రాజధాని!:

2014లో కూటమిని ప్రజలు గెలిపించడానికి గల ప్రధాన కారాణల్లో చంద్రబాబు సీనియారిటీ, మోడీ పాపులారిటీ ప్రధానంగా పనిచేశాయనే చెప్పాలి. అయితే… ఆ విలువను, గౌరవాన్ని చంద్రబాబు మోడీలు కాపాడుకోలేదు! ఎన్నికల ముందు చెప్పిన చిలకపలుకులేవీ నెరవేర్చలేదు! ఆ విషయం ఏపీ ప్రజలకు గుర్తుంటే… 2024లో ఆ కూటమికి పెను ప్రమాదమే పొంచి ఉందని చెప్పొచ్చు!

మరోపక్క రాజధాని అమరావతి పేరు చెప్పి చంద్రబాబు ప్లే చేసిన రోల్స్ అన్నీ ఇన్నీ కాదు! ఒకానొక దశలో అమరావతిని ని ఏపీ ప్రజలంతా నమ్మారు.. అయితే.. ఆ నమ్మకాన్ని చంద్రబాబు మాగ్జిమం కోల్పోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి పేరుచెప్పి జరిగినట్లు చెబుతున్న అవకతవకలు తెరపైకి రావడంతో.. మొత్తం మ్యాటర్ పై ప్రజలకు స్పష్టత వచ్చినట్లయ్యింది.

ఈ సమయంలో మరోసారి మోడీతో జతకట్టిన వేళ.. రాజధాని నిర్మాణం, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంపై.. మోడీతో చంద్రబాబు బలంగా చెప్పించ గలగాలి. ఇదే సమయంలో ఆయన కూడా ప్రజల సమక్షంలో ఈ విషయాన్ని మోడీ ముందు ప్రస్థావించాలి. అందుకు అవసరమైన నిధులు ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వద్ద లేవు కాబట్టి… కేంద్రం ఏమేర సహకారం అందించబోతుందనేది మోడీ నోటితో చెప్పించే ప్రయత్నం చేయాలి!

వైఎస్ వివేకా హత్య కేసు:

వాస్తవానికి వివేకా హత్య కేసు వ్యవహారం 2019 ఎన్నికలకు ముందు సబ్జెక్ట్ అయినప్పటికీ… ఇటీవల కాలంలో ఇది మరింత వైరల్ గా మారింది. ఈ ఎఫెక్ట్ కడప జిల్లాలో వైసీపీపై కాస్త ఎక్కువ ప్రభావమే చూపించొచ్చని ఒకవర్గం చెబుతున్న వేళ… ఎన్నికల సమయానికి తనపై వస్తోన్న ప్రచారాన్ని జగన్ & కో గట్టిగా తిప్పికొట్టగలగాలి. లేదంటే.. ప్రత్యర్థులు చెప్పేదే నిజం అని జనం భావించే ప్రమాదం లేకపోలేదు!

చంద్రబాబు అరెస్ట్!:

40 ఏళ్లకు పైబడి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఫస్ట్ టైం ఊచలు లెక్కపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో… జనసేన అధినేత పొత్తుపై ఓపెన్ అయ్యారు. దీనిపై కూటమికి సానుభూతి ఏ మేరకు ఉంటుందనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.

అయితే… సానుభూతి వర్కవుట్ అవుతుందా.. లేక, కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్ర, నిలబెడతాడు అని నమ్మి అధికారం అప్పగిస్తే ఇలా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మలిచినందుకు, సీనియారిటీ పేరు చెప్పి కుర్చీ ఎక్కి, ఆ సీనియారిటీని దోచుకోవడానికి ఉపయోగించడం వల్ల తగిన శాస్తి జరిగిందని ప్రజలు భావిస్తారా అనేది వేచి చూడాలి.

క్రెడిబిలిటీ!:

ఈ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన పాత్ర వహించే అంశం ఇది! ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేయడం.. తిరిగి ఎన్నికలు వచ్చే నాటికి ప్రజలు ఆ విషయం గుర్తుండకుండా మరికొన్ని హామీలు ఇవ్వడం సాధారణంగా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. లేకపోతే… భారతదేశం అమెరికాను దాటేసీ చాలా కాలమే అవ్వాలి. ఏపీ సింగపూర్ అయ్యి చాలా ఏళ్లే అవ్వాలి!

రానున్న ఎన్నికల్లో.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం అనే అంశం కూడా కీలక భూమిక పోషిస్తుందనే చెప్పాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానం… 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేసిన విధానం అనేది ఈ ఎన్నికల్లో కీ రోల్ పోషించబోతుందని అంటున్నారు పరిశీలకులు.

క్లాస్ వార్!:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ తెరపైకి తెచ్చిన “క్లాస్ వార్” అనే మాట కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. పైగా… తాను చెప్పినట్లుగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం టిక్కెట్లు ఇవ్వడం.. వారిలో పేదలు, సామాన్య కార్యకర్తలు కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా… ఆ మధ్యతరగతి వ్యక్తులు పోటీ చేసే చోట చంద్రబాబు… అత్యంత ధనవంతులను పోటీకి నిలబెట్టడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది.

రానున్న ఎన్నికల్లో ఈ విషయం కూడా ప్రధాన భూమిక పోషించబోతోందని అంటున్నారు. మరి ఈ అరడజను విషయాలకు అధిక ప్రాధాన్యం అని చెబుతున వేళ.. ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాలి!