ప్రస్తుతం వారాహియాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన చేస్తోన్న అతి వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు వాయించి వదులుతున్నారు. వీరిలో కొంతమంది చురకలు అంటిస్తుంటే.. మరికొంతమంది సవాళ్లు విసురుతున్నారు.. ఇంకొంతమంది రివర్స్ అటాక్ చేస్తోన్నారు.
ఈ సమయంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యదవ్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ కు పరోక్షంగా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. జగన్ తో చెప్పి చెప్పి రాదు.. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దన్నట్లుగా సూచించారు. జగన్ నమ్ముతూ ఉన్నాడని తక్కువ అంచానా వేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చే పనికి పూనుకున్నారు!
అవును… ఋషికొండపై నివాసం ఉండటానికి జగన్ ఏమన్నా దేవుడా? జగన్ ను పులివెందుల తరిమికొడతాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ వారాహి వాహనానికి పెట్రోల్ దండగ అని.. ఆ మాటల వల్ల ఆయనకు శ్రమ దండగ అని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో ఏదో ఊహించుకుని మాట్లాడుతున్న పవన్ మాట్లాడేది, చెప్పేది ఏదీ జరగదని.. 2024లో జగన్ ఒక్కరే అందర్నీ ఓడించి హైదరాబాద్ కు పంపిస్తారని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు. ఇదే సమయంలో పవన్ ఫ్యూచర్ కే క్లారిటీ లేదని.. అటువంటిది ఆయన జనసైనికులకు, అభిమానులకు ఏం భరోసానిస్తాడని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.
పవన్ ఓటమి ఖాయమని, కానీ పవన్ కి జై కొడుతూ పిల్ల సైనికులు తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని తెలిపిన ఆయన… అభిమానం అంటూ జీవితాలను పవన్ వెంట తిరిగి నాశనం చేసుకోవద్దని యువకులకు హితవు పలికారు. ఇలా నిజాయితీగా తనపై అభిమానంతో వస్తున్న యువకులను పవన్ మోసం చేస్తున్నారని అనిల్ ఆరోపించారు.
ఇదే సమయంలో జనసైనికులకు మరిన్ని సూచనలు చేసిన అనిల్ కుమార్… ఇళ్లల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ ఖర్చు పెట్టి పవన్ వెంట బైకులు వేసుకొని తిరిగి జీవితాలు నాశనం చేసుకోవద్దని, 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న విలువైన సమయాన్ని పవన్ వెంట తిరిగి వృధా చేసుకోవద్దని మాజీ మంత్రి అనిల్ కుమార్ సూచించారు. ఈ పీక్ ఏజ్ లో కెరీర్ పై దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలు చేసుకోవాలని అన్నారు.
అనంతరం పవన్ కు స్మూత్ వార్నింగ్ ఇచ్చే పనికి పూనుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు, పవన్ కట్టగట్టుకుని వచ్చినా జగన్ వెంట్రుక కూడా టచ్ చేయలేరని, జగన్ ని ఆటాడించే దమ్ము ధైర్యం ఉన్న మగోడు ఏపీలో పుట్టలేదని అనిల్ వ్యాఖ్యానించారు. అనంతరం… నవ్వుతూ కామ్ గా ఉన్నాడని, జగన్ ఏమీ చేయడని అనుకోవద్దని స్మూత్ గా తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.