గూగుల్.. ఇప్పటి వరకు సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతూ వచ్చిన ఈ సెర్చ్ ఇంజన్ సాధనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అదేమిటి… గూగుల్ కు ఏపీ రాజకీయాలకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా.. ఉంది. ఇప్పుడు ఈ గూగుల్ చెబుతున్న విషయాలే రాజకీయ నాయకులకు విమర్శనాస్త్రాలు అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి, జస్టిస్ రాకేశ్ కుమార్ కు మధ్యన వాదోపవాదనలు జరిగిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కుమార్ రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం జరుగుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి తెలుపుతామనే వ్యాఖ్యలు చేశారని, విచారణలో ఆయన మీద నమ్మకం లేదని, ఆయన్ను విచారణ నుండి తొలగించాలని అంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అఫిడవిట్ వేయగా రాకేష్ కుమార్ తన వాదనల్లో గూగుల్ ప్రస్తావన తెచ్చారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో జగన్ గురించి తెలుసుకోవాలనుకున్న తనకు గూగుల్‌లో ఖైదీ నం. 6093 అని కొడితే సమాచారం వస్తుందని చెప్పారు. నేను అలాగే చేశాను. అందులో విస్తుపోయే వివరాలు తెలిశాయి. ఆ వివరాలు ఉత్తర్వుల్లో పొందుపరుస్తున్నాను. రాష్ట్ర సీఎం 11 సీబీఐ, ఆరు ఈడీ, మరో 18 ఐపీసీ కేసుల్లో నిందితుడని తెలిసిందని అంటూ ఆ వివరాలను ధర్మాసనానికి సమర్పించారు. ఏకంగా హైకోర్టు జస్టిస్ అలా ఒక సీఎం గురించి గూగుల్ నందు విస్తుపోయే విషయాలు చూశానని అనడంతో జనం కూడ జస్టిస్ చెప్పిన తరహాలోనే వెతుకుతూ కనిపించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావుడి చేస్తున్నారు.
ఇక అధికార పార్టీ నేత, మంత్రి కొడాలి నాని ఈ వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూ న్యాయమూర్తి గూగుల్‌లో జగన్మోహన్ రెడ్డి గురించి కొడితే ఏదో వస్తుందని అంటున్నారంటూ మండిపడ్డారు. తాను జగన్మోహన్ రెడ్డి గురించి గూగుల్ లో వెతికితే ఆయన కుటుంబ నేపథ్యం ఉందని నాని తెలిపారు. అంతేకాదు ఎలాంటి బలవంతుడినైనా ఢీ కొట్టే శక్తి ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. తాను గూగుల్ లో వైఎస్ జగన్ గురించి సెర్చ్ చేస్తే ఎవరి కాళ్లు పట్టుకోని నేతగా, కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన నాయకుడిగా చూపించిందని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా కనీసం ఊహకు కూడా అందని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా తనకు గూగుల్ వైఎస్ జగన్ గొప్పదనం గురించి వివరించిందని కొడాలి నాని అన్నారు.
అంతేకాకుండా మధ్యలోకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తీసుకొచ్చి వైఎస్ జగన్ గురించి రిటైర్డ్ జస్టిస్ రాకేష్ కుమార్ వెతికితే ఎలాంటి సమాచారం వచ్చిందో తాను గూగుల్ లో తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి వెతికితే అలాంటి సమాచారమే వచ్చిందని అన్నారు. ఇలా నాని చంద్రబాబు, పవన్ ల గూగుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడటంతో వారి తప్పిదాలు, పొరపాట్లు, వారి మీద ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు, విమర్శలు ఎలా ఏం బయటికొస్తాయనే కంగారు టీడీపీ, జనసేనల్లో నెలకొంది. మొత్తానికి గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలను కంగారును గురిచేస్తోంది.