ఏపీలో మరో కొత్త జిల్లా… పేరేంటంటే…!

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ ఉన్న 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరున ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామనే! ఇందులో భాగంగా… ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. అయితే ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలన్నింటినీ కలిపి ఏర్పాటు చేసిన “అల్లూరి సీతారామరాజు జిల్లా” మరీ పెద్దది అయిపోయింది. మారుమూల ప్రాంతాలకు జిలా హెడ్ క్వార్టర్ దూరమైపోతుంది. దీంతో… ఏజెన్సీ ప్రాంతాలను రెండు జిల్లాలుగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను చేసింది. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి.

అయితే… మన్యం ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేసినాకూడా… ఇంకా మారుమూల ప్రాంతాలకు జిల్లా కేంద్రాలు దూరమై పోతుండటంతో.. ఇంకో కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్న దొర 27వ జిల్లాపై హింట్ ఇచ్చారు. ఏజెన్సీ మన్యం ప్రాంతాలతో మరొక జిల్లాను ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ నిర్ణయించారని రాజన్న దొర వెల్లడించారు.

అయితే… గతంలోనే రంపచోడవరం కేంద్రంగా.. మరో కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరును.. పార్వతీపురం మన్యంకు పార్వతీపురంను జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలు, ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే గ్రామాలన్నింటిని కలిపి మరొక కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఈ జిల్లాను “పోలవరం” పేరుతో ఏర్పాటు చేస్తారని.. దీనికి రంపచోడవరం.. జిల్లా కేంద్రంగా ఉంటుందని చెబుతున్నారు.

వాస్తవానికి గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే ఈ 27వ జిల్లాను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేశారు. అయితే స్థానిక ఇబ్బందులు, కొంతమంది ప్రజల అభ్యంతరాలు, పరిపాలన పరంగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఇబ్బందుల దృష్ట్యా నాడు ఆ ప్రతిపాదన వాయిదా పడింది. అయితే… ఇప్పుడు మరోసారి 27వ కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది!