ఎంఓయూలే అయినా అవి గ్రాఫిక్స్ కాదు!

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ గ్లోబల్ సమ్మిట్ 2023 అనుకున్నదానికంటే అధికంగా సక్సెస్ అయ్యిందనే ఉత్సాహంలో ఉన్నారు జగన్ & కో! అయితే వారి ఉత్సాహాన్ని కరిగించే విధంగా.. ఇప్పటికే టీడీపీ & కో లు వెటకారాలు మొదలుపెట్టేసింది. విశాఖలో జరిగింది ఎంఓయూలే కదా, ఆ పనులు గ్రౌండింగ్ కావాలి కదా అంటుంది టీడీపీ. దీంతో ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు జగన్!

ఒప్పందాలు ఎంత వేగంగా, మరెంత బలంగా జరిగాయో.. అంతే తొందరగా పనులు కూడా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబందిత మంత్రి – అధికారులకు జగన్ అప్పుడే సూచనలు మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో… గతంలో ఉన్నది మాటల ప్రభుత్వం, గ్రాఫిక్స్ ప్రభుత్వం.. తమది చేతల ప్రభుత్వం అని ఇప్పటికే టీడీపీ మాటలకు కౌంటర్స్ మొదలుపెట్టారు వైసీపీ నేతలు.

ప్రస్తుతం విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో 350కి పైగా ఎంఓయూలు కుదిరిన సంగతి తెలిసిందే. వీటి విలువ 13 లక్షలకోట్ల రూపాయల పైమాటే. ఇవన్నీ అమలులోకి వస్తే 6 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదంతా ఎప్పటికి కార్యరూపం దాలుస్తుంది అనేది టీడీపీ మాట! అయితే ఎన్నికల్లోపు ఇదంతా కార్యరూపం దాల్చాలని.. అదంతా స్పీడ్ గా జరిగిపోవాల్సిందేనంటున్నారు సీఎం జగన్.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉందని.. అది చేతల్లో కూడా చూపిస్తామని చెబుతున్న జగన్… తమతో ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని.. వారికి అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తుందని భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంలో… అత్యంత కీలకమైన సమయంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని చెబుతున్న జగన్… దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఏపీని రూపొందించడంలో ఈ సదస్సు కీలకపాత్ర పోషించిందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో… గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని జగన్ చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా… ఈ సమ్మిత్ ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడంతో వైకాపా శ్రేణులు మాంచి ఉత్సాహం మీద ఉన్నాయని.. ఎన్నికల లోపు పనులు కూడా ప్రారంభమైపోతే.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారంట!