ఏపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

ఏపీ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి విడుదల చేశారు.  త్వరలోనే తాము పోటి చేయబోయే అభ్యర్దుల పూర్తి జాబితా విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసే బాధ్యత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు.

వెనుబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని తీసుకొస్తామన్నారు. వీటితో పాటు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులకు కళ్లెం వేస్తామని చెప్పారు.  

మ్యానిఫేస్టోలో ముఖ్యాంశాలు 

  ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచిత సరఫరా
 వికలాంగులకు రూ.3వేలు పింఛను
 రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
 వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి
 స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర
 రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
 విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు
 ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం
 రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులు చేరుస్తాం
 కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ
 పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరల నియంత్రణ
 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి రూ.2వేలు పింఛను
 60-70 ఏళ్ల వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు పింఛను
 ఒంటరి మహిళలకు పెన్షన్‌
 సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్‌ విధానం తొలగింపు
 దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
 ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధత కూడిన సబ్‌ప్లాన్‌