రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు ఇది చేదువార్త. ఎందుకంటే రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాధికార కమిటీ అయిన సిడబ్ల్యుసి ని ప్రకటించారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు మొండిచేయి చూపారు. మొత్తం కమిటీ 23 మందితో కొలువుదీరింది. కానీ అందులో తెలంగాణ నేతలకు కానీ, ఆంధ్రా నేతలకు కానీ చోటు దక్కకపోవడంతో తెలుగు రాష్ట్రాల నాయకులు నిరుత్సాహంతో ఉన్నారు.
నిజానికి తెలంగాణ రాష్ట్రం రానున్న ఎన్నకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటన్నారు. మరి అలాంటప్పుడు తెలంగాణ నుంచి సిడబ్ల్యూసి లో ఎందుకు సభ్యత్వం దక్కలేదన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కమిటీలోకి తీసుకునే సమర్థత ఉన్న నాయకులు లేరన్న ఉద్దేశంతో చోటు కల్పించలేదా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఎపిలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి తిరిగి చేరారు. కానీ ఎపి నుంచి కూడా ఎవరినీ సిడబ్ల్యూసికి తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు. బలపడి అధికారం చేజిక్కించుకునే చాన్స్ ఉన్న తెలంగాణకే మొండిచేయి చూపిన క్రమంలో ఎపికి ఎందుకు చోటు కల్పిస్తారని తెలంగాణ నేతలు పెదవి విరుస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటే దేశం మొత్తంలో కేరళకు అగ్రతాంబూలం ఇచ్చారు రాహుల్ గాంధీ. కేరళ నుంచి ముగ్గురిని సిడబ్ల్యూసి కి తీసుకున్నారు. వూమెన్ చాంది, కేసి వేణుగోపాల్, ఎకె ఆంటోనీలకు సిడబ్ల్యూసి లో చోటు దక్కింది. అలాగే పక్కన ఉన్న కర్ణాటక నుంచి కూడా ఇద్దరికి చోటు కల్పించారు. కర్ణాటక మాజీ సిఎం సిద్ధరామయ్య తోపాటు పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేకు కూడా చోటు దక్కింది.
సిడబ్ల్యూసి మొత్తం సభ్యులు 23 మందిలో దక్షిణాది నుంచి కేవలం ఐదుగురు మాత్రమే ఉండగా మిగతా 18 మంది ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మరో విషయం ఏమంటే తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపినట్లే తమిళనాడుకు కూడా రాహుల్ మొండిచేయి చూపారు. తమిళనాడు నుంచి కూడా ఒక్కరిని కూడా సిడబ్ల్యూసికి తీసుకోలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బలం, బలగం లేకపోవడంతో ఆ రాష్ట్రాన్ని కూడా రాహుల్ గాంధీ లెక్కలోకి తీసుకోలేదని చెబుతున్నారు.
ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొద్దిగా ఇరకాటంలోకి నెట్టే విషయంగానే భావిస్తున్నారు. సిడబ్ల్యూసి కొత్త జాబితా ప్రకటించే వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎన్టియుసి నేత సంజీవరెడ్డి సభ్యులుగా ఉండేవారు. అయితే కొత్త జాబితాలో ఆయనను తొలగించారు కానీ ఎవరినీ నియమించలేదు.
సిడబ్ల్యూసి సభ్యుల జాబితా కింద ఉంది చూడండి.