ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే అంతేనా.?

దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలోనూ ఇలాంటి దుష్ప్రచారం జరగదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ అంతే.. ఇప్పుడు.. అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అంతే. చిత్రంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ తరహా ఆరోపణలు రావు.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఢిల్లీకి సూట్ కేసుల్లో సొమ్ముని కేవీపీ రామచంద్రరావుతో పంపేవారన్న విమర్శలు అప్పట్లో గట్టిగా వినిపించేవి రాజకీయ ప్రత్యర్థుల నుంచి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడుతున్నారనే విమర్శలూ వినిపించేవి. ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరుగుతోంది.

కర్నాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల సొమ్ముల్ని బీజేపీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు, అలా ఏపీ ముఖ్యమంత్రి నుంచి కప్పం కట్టించుకునేందుకే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుందని టీడీపీతోపాటు సీపీఐ ఆరోపిస్తోంది.

రాజకీయ విమర్శలకూ ఓ హద్దుండాలి. దురదృష్టం, ఏపీ రాజకీయాల్లో అలాంటి హద్దుల గురించి మాట్లాడుకోవడం దండగ. ఇక్కడ అవమానిస్తున్నది ఏపీ ముఖ్యమంత్రి పదవిలో వున్న ఆయా నాయకుల్ని కాదు.. ఏపీ ముఖ్యమంత్రి పదవిని.! ఇందుకే కదా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో, నిధుల విడుదల విషయంలో పట్టించుకోనిది.? రాష్ట్రంలో రాజకీయాలు రాష్ట్రంలో చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటవ్వాలి. కానీ, అది జరిగే పని కాదు.!