వ్యూ పాయింట్ పేరు రచ్చ… ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో పేర్ల మార్పు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఎవరి పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టినా… ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రభుత్వపై విమర్శనాస్తాలు ఎక్కిపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసిన పనిని విమర్శిస్తున్నాయి. అయితే… వాస్తవాలు వేరుగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం!

విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ను.. వైఎస్సార్ వ్యూ పాయింట్‌ గా మార్చడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్య జీ20 సన్నాహక సదస్సు సందర్భంగా కోట్ల రూపాయలు కేటాయించి వ్యూ పాయింట్‌ ను ప్రభుత్వం అభివృద్ది చేసింది. అందులో భాగంగానే వ్యూ పాయింట్‌ పేరును మార్పుచేసింది. అయితే సీత కొండగా ఉన్న వ్యూ పాయింట్‌ ను అప్పట్లో అబ్దుల్ కలాం పేరుగా మార్చామని… దాన్ని కూడా వైఎస్సార్ పేరుకు మార్చారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. కలాం వ్యూ పాయింట్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్‌ గా మార్చడం బాధాకరం అని అన్నారు. అయితే… చంద్రబాబు కలాం వ్యూ పాయింట్ పై చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు స్పదించారు.

విశాఖ బీచ్ వ్యూ పాయింట్ తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి ఇక్కడ ఉన్న స్థలంలో గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేయలేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.. గతంలో వ్యూ పాయింట్‌ గా వ్యవహరించేవారే తప్ప… అధికారికంగా గత ప్రభుత్వం పేరు ఏదీ పెట్టలేదని తెలిపింది. తాజాగా జీ-20 సదస్సు కోసం చేపట్టిన నగర సుందరీకరణ పనుల సమయంలో ఇక్కడ వ్యూ పాయింట్ ను అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇచ్చారని.. దీంతో తాము అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, అనుమతికి సంబంధించిన లేఖలు, పేపర్ కట్టింగులను ను జత చేసింది వైసీపీ సర్కార్! దీంతో… రుజువులతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టింది!