Satyakumar Yadav: పీపీపీ విధానంపై చర్చకు రావాలని జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గట్టి సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న జగన్‌, తన ప్రతిపాదనకు ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. శనివారం అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది ప్రజలను కొంతకాలం మోసం చేయొచ్చు కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని మంత్రి సత్యకుమార్ అన్నారు. పీపీపీ విధానంలో కొన్ని వైద్య కళాశాలల అభివృద్ధి, నిర్వహణపై తన వాదనకు సొంత పార్టీలోనే మద్దతు లభించడం లేదని జగన్ గ్రహించినందుకు అభినందనలు తెలిపారు.

‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో పోలీసుల వైఖరిపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు

పోలవరం పనుల విధ్వంసం: జగన్ పాలనపై సీఎం చంద్రబాబు ఫైర్

జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విఫలమయ్యాయని, దీనివల్ల ఆయనకు జ్ఞానోదయం కలగడం మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ వాదనను సమర్థించకపోవడంతో నిరసన కార్యక్రమం నీరసించిపోయిందని ఆయన విమర్శించారు. పులివెందులలో కూడా జగన్ ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం ఆయన వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.12 లక్షలు, రూ.20 లక్షలుగా పెంచి, రాజకీయ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జగన్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవడం వల్లే వారి నిరసన కార్యక్రమం విఫలమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇకనైనా జగన్ చర్చకు రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు.

Pepakayala Ramakrishna on Chandrababu Comments | Telugu Rajyam