Anam Gets Special Gift : మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సౌమ్యుడు. సీనియర్ పొలిటీషియన్ అయినా, నిలకడలేని తత్వం పెరిగిపోయిందన్న విమర్శలు ఆయన మీద చాలానే వున్నాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారాయన. ఆనం రామనారాయణరెడ్డికి అప్పట్లో ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కొండంత బలంగా వుండేవారు.
సరే, అది గతం. వైసీపీలోనూ ఆనం హవా కొన్నాళ్ళు బాగానే సాగింది. అయినాగానీ, గత కొంతకాలంగా ఆయనకు పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదన్న చర్చ జరుగుతోన్న సమయంలోనే, ఆయన నిరసన గళం వినిపించడ మొదలు పెట్టారు. స్థానికంగా అధికారులు సరిగ్గా పని చేయడంలేదనీ, జిల్లా మంత్రుల పని తీరు బాగాలేదనీ ఆనం విమర్శలు షురూ చేశారు.
ఇంతలోనే జిల్లాల అంశం తెరపైకొచ్చేసరికి ఆనం మరింతగా చెలరేగిపోయారు. నర్సాపురం నుంచి నెల్లూరు మీదుగా నిరసనల ఎక్స్‌ప్రెస్.. అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజునీ, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డినీ ఒకే గాటన కట్టేశారు వైసీపీలో. ఏమయ్యిందోగానీ, సీన్ రాత్రికి రాత్రి మారిపోయింది.
జిల్లాల విభజన విషయమై ఆనం అభ్యంతరాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిగణనలోకి తీసుకున్నారట. అంతే కాదు, ఆనం రామనారాయణరెడ్డికి క్యాబినెట్ బెర్త్ కూడా ఖరారయ్యిందని సమాచారం. మామూలుగా అయితే, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై వైఎస్ జగన్ ఉక్కుపాదం మోపుతుంటారు. కానీ, ఆనం విషయంలో సీన్ రివర్స్ అయ్యింది.
ఆనం రామనారాయణరెడ్డిని వైఎస్ జగన్ బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. దాంతో, ఆనం కూడా నిరసన గళాన్ని పక్కన పెట్టారు. సో, నెల్లూరు జిల్లా వైసీపీలో గందరగోళం చల్లారినట్టే. కానీ, ఆనం విషయంలో వైఎస్ జగన్ వెనక్కి తగ్గడానికి కారణమేంటన్నది మాత్రం వైసీపీ వర్గాలకే అర్థం కావడంలేదు.