ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచారనే కారణంతో ఆనం రామనారాయణ రెడ్డిపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు.. పార్టీ నుంచి బయటకు పంపించేశారు. దీంతో మనకు టీడీపీయే బెటర్, చంద్రబాబు నాయకత్వమే కరెక్ట్ అనుకున్నారో ఏమో కానీ… ఆనం టీడీపీలో చేరిపోయారు!! లోకేష్ పాదయాత్రకు పత్రికల్లో వెల్ కం ప్రకటనలు ఇవ్వడంతోపాటు.. పాదయాత్రకు ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు!
ఇలా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనంకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఫలితంగా మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొందని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగా… ఈసారి ఆయన పోటీచేస్తారని వార్తలొస్తున్న ఆత్మకూరు లో టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొందని అంటున్నారు. ఇంతకాలం పార్టీ జెండాను కాపాడుకుంటూ వచ్చిన వారికి ఆనం వల్ల ప్రాధాన్యత తగ్గుతుందని వాపోతున్నారంట.
అవును… ఆత్మకూరులో లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ఆనం ఆశించారని అంటున్నారు. దీంతో… మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు… అటు లోకేష్, ఇటు అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని వాపోతూ… పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని తెలుస్తుంది.
ఇదే సమయంలో మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును సైతం చంద్రబాబు కరివేపాకులా తీసేశారని అంటున్నారు. ఫలితంగా తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆత్మకూరు బాధ్యతలు ఇంతకాలం జెండా కాపాడిన తనకు కాదని వైసీపీ నుంచి వచ్చిన ఆనంకు అప్పగించడంపై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.
ఈ పరిస్థితుల్లో వైసీపీకంటే ముందు వీళ్లే తనను ఓడించేలా ఉన్నారని గ్రహించారో ఏమో కానీ… ఆనం దృష్టి ఆత్మకూరు నుంచి నెల్లూరు సిటీకి మళ్లిందని చెబుతున్నారు. దీంతో పరిస్థితి గమనించిన మాజీమంత్రి నారాయణ… వెంటనే చంద్రబాబుతో తానే ఇన్ ఛార్జ్ అని ప్రకటించేసుకున్నారు. అయినప్పటికీ ఆనం ఆ ప్రయత్నాలు మానలేదని తెలుస్తుంది! దీంతో నారాయణ అనుచరులు ఆనంపై ఫైరవుతున్నారని తెలుస్తుంది.
దీంతో ఆనం పరిస్థితి రెంటికీ చెడ్డ రేవటిలా మారేలా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు వైసీపీని కాదని ఇటు టీడీపీలో చేరి చక్రాలు తిప్పుదామని ప్రయత్నిస్తే.. ఇలా బెడిసి కొట్టిందేమిటని అనుచరుల దగ్గర వాపోతున్నారని సమాచారం. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే… ఎన్నికల నాటికి ఇంతకాలం నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన టీడీపీ నేతల ఆగ్రహం ఇంకేస్థాయిలో ఉండబోతుందో వేచి చూడాలి!