బీజేపీతో బాబు: నుయ్యిలో పడతారా.. గొయ్యిలో పడతారా?

గెలుపు అనివార్యం అయిన రాబోయే ఎన్నికల్లో పొత్తుల కోసం బాబు అర్రులు చాస్తున్న పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో కాస్త తొందర పడ్డారనే మాటలూ వస్తున్నాయి. అయితే బీజేపీతో బాబుకు పొత్తు అనివార్యమా కాదా అన్న సంగతి పక్కనపెడితే… పొత్తు పెట్టుకుంటే ఒక సమస్య – పెట్టుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా ఉంది బాబు పరిస్థితి అనే విశ్లేషణ తెరపైకి వచ్చింది!

చంద్రబాబు తన ఢిల్లీ టూర్ లో బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయం మాట్లాడేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారని కథనాలొస్తున్నాయి. ఇక ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌రాజు… టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఎన్నికలకు వెళ్ళటం ఖాయమంటూ కన్ ఫాం చేసేస్తున్నారు. పైగా… ఈ మూడు పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యమని జోస్యం చెప్పేస్తున్నారు!

దీంతో చంద్రబాబు బీజేపీతో పెట్టుకుంటే వచ్చే సమస్యలు.. పెట్టుకోకపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీతో జతకట్టి “మోడీ – బాబు” ద్వయాన్ని నమ్మాలని, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతామని చెప్పుకొచ్చారు. జనం నమ్మారు. ఫలితంగా అధికారం ఇచ్చారు. అయితే అనంతరం 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరి బంధం వీడిపోయింది.. ఫలితంగా బాబు ప్లేట్ ఫిరాయించారు.

బీజేపీ తనను మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయలేదని… ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలు అని చంద్రబాబే ఒప్పుకున్నారని, పోలవరాన్ని తాము కడతామంటే… లేదు లేదు తనకు ఇచ్చేయండని బాబు అడిగారని, దాంతో పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నారని, ఫలితంగా ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది చంద్రబాబే అని బీజేపీ పెద్దలు చెప్పుకొచ్చారు!

దీంతో వీరిద్దరి ఉమ్మడి మోసాలపై ఏపీ జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నేలకేసి కొట్టగా… బాబుని బండకేసి బాది వదిలారు. దీంతో లబోదిబోమన్న చంద్రబాబు ఎన్నికలుసమీపిస్తున్న వేళ మరోసారి బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు! దీంతో… చంద్రబాబు వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఏపీ జనాలు. ఫలితంగా బీజేపీతో పొత్తు టీడీపీ చావుకొచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాబుకు జరగబోయే డ్యామేజ్!

ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే… జాతీయ స్థాయిలో బాబుకు బలం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హస్తిన లోని కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబుని నమ్మె పరిస్థితి లేదు! నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు! దీంతో… జాతీయస్థాయిలో చక్రలు తిప్పి ఏపీలో జగన్ ని కంట్రోల్ చెయ్యాలంటే… ఇప్పుడు బాబుకి ఉన్న ఆప్షన్ బీజేపీ మాత్రమే! సో.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే అది సాధ్యం కాదు.

ఇలా బీజేపీతో పొత్తు విషయంలో బాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే చంద్రబాబు నుయ్యిలో పడతారా.. గొయ్యిలో పడతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి!