2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడి కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది తెలుగుదేశం. కానీ గెలిచిన ఆ 23 స్థానాల్లో మాత్రం టీడీపీ ఎంత బలంగా ఉందో ప్రూవ్ అయింది. మొదటి నుండి అ 23 స్థానాలు టీడీపీకి కంచుకోటల్లా ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ హవా ఎంత నడిచినా ఆ 23 చోట్ల మాత్రం టీడీపీదే పైచేయి అయింది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడిచినా ఆ 23 నియోజకవర్గాల్లోని కొన్నింటిలో ఎలా బలపడాలో వైసీపీకి అర్థం కావట్లేదు. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా రేపల్లె ఒకటి. ఇక్కడ తెలుగుదేశం వేళ్లూనుకుని ఉంది. పార్టీ పెట్టినప్పటి నుండి జరిగిన ఎన్నికల్లో రెండు మూడు సార్లు మినహా 1985, 94, 99, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.
ఇక గుంటూరు జిల్లా మొత్తంలో చూస్తే 17 అసెంబ్లీ స్థానాల్లో రేపల్లె, గుంటూరు వెస్ట్ స్థానాల్లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. వాటిలో కూడ వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి జైకొట్టారు. దీంతో జిల్లాలో టీడీపీ తరపున పనిచేస్తున్న ఒకే ఒక ఎమ్మెల్యే అనగాని ప్రసాద్ అయ్యారు. మొదటి నుండి గుంటూరు జిల్లాలో కమ్మ నేతలు ఆధిపత్యం ఎక్కువ. గుంటూరు టీడీపీ బడా నేతలంతా కమ్మ వర్గానికి చెందినవారే. వారి డామినేషన్ మూయాలంగా బీసీ నేతలు వెనకబడుతూనే వచ్చారు. గత దఫాలో చూస్తే కమ్మ నేతలు జిల్లాను పూర్తిగా కమ్మేశారు. ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల శివప్రసాద్ పూర్తిగా జిల్లాను కమ్మేశారు. దీంతో సత్యప్రసాద్ పేరు నియోజకవర్గం దాటి బయటకు రాలేదు.
కానీ ఈసారి మాత్రం మహామహులు ఓడిపోయి సత్యప్రసాద్ మాత్రమే గెలిచారు. అధికారంలో ఉండగానే నిర్లక్ష్యం చేసిన నేతలు ప్రతిపక్షంలోకి దిగిపోయినప్పుడు, ఓటమి భారంలో ఉన్నప్పుడు ఎలా పట్టించుకుంటారు. పట్టించుకోలేదు. అందుకే అనగాని ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. నియోజకవర్గంలో పార్టీని ఒక్కడే భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. పార్టీ మారమని బలమైన ఒత్తిళ్లు వస్తున్నా తట్టుకుని నిలబడుతున్నారు. నియోజకవర్గంలో ఓడిన మోపిదేవి వెంకటరమణని జగన్ మంత్రిని చేసి ఆ తర్వాత రాజ్యసభకు కూడ పంపారు. అయినా సత్యప్రసాద్ వెనక్కు తగ్గట్లేదు. ఎక్కడిక్కడ శ్రేణులను కాపాడుకుంటూ ముందుకెళుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎలా బలపడాలో పాలుపోక వైసీపీ హైకమాండ్ సైతం బుర్రబద్దలు కొట్టుకుంటోందట.