మిర్యాలగూడ అమృత ప్రణయ్ ల మొదటి పెళ్లి రోజు నేడే, అమృత స్పందన

తెలంగాణలో సంచలనంగా మారిన మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే అమృత ప్రణయ్ ల పెళ్లి జరిగి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం. దీంతో అమృత తమ పెళ్లి రోజు పై స్పందించింది. సెప్టెంబర్ లో ప్రణయ్ ని మామ మారుతీరావు మర్డర్ చేయించిన సంగతి తెలిసిందే. అమృత ఫేస్ బుక్ లో ఏమని స్పందించిందంటే…

“గతేడాది ఇదే రోజున నిన్ను కలుసుకునేందుకు, నీ చేతిని పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూశాను. ఇప్పుడు మన చిన్నారిని ఎత్తుకునేందుకు ఎదురుచూస్తున్నా. ఈ కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. లవ్ యూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా” అని జస్టిస్ ఫర్ ప్రణయ్ ఫేస్ బుక్ పేజీలో  అమృత పోస్ట్ చేశారు.

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిపోయింది. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ ని సెప్టెంబర్ లో హత్య చేయించాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భిణి. ఆ తర్వాత అమృత తన తల్లిగారింటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. 

ప్రణయ్ హత్య తర్వాత ఆ కేసు పలు మలుపులు తిరిగింది. అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీనిని సహించని మారుతీరావు దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితులందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు.  

ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ లకు వ్యతిరేకంగా పలు కామెంట్లు వచ్చాయి. 9 వ తరగతిలేం ప్రేమ అని కొందరు, మారుతీరావు చేసింది కరెక్టే అని కొందరు కామెంట్లు చేశారు. ప్రభుత్వం అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, 14 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని హామీనిచ్చింది. అలాగే మరికొందరు ప్రణయ్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. అమృత ఫిబ్రవరి మొదటి వారంలో డెలివరీ కానుంది. త్వరలోనే ప్రణయ్ మళ్లీ పుడుతాడని అమృత ఆశాభావం వ్యక్తం చేసింది.